జోగులాంబ గద్వాల జిల్లాలో సాగవుతున్న విత్తన పత్తి విషయంలో సీడ్ కంపెనీలు.... ఆర్గనైజర్లు, రైతులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని దాని ప్రకారమే నడుచుకోవాలని కలెక్టర్ శ్రుతి ఓఝా సూచించారు. కలెక్టరేట్లో విత్తన పత్తి కంపెనీలు, ఆర్గనైజర్లు, రైతులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్గనైజర్ల వ్యవస్థను తొలగించి రైతులు నేరుగా కంపెనీ వారి నుంచి కొనుగోలు వ్యవహారాలు నడపిస్తే తాము లాభపడతామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఒప్పంద ప్రక్రియకు ఆంగీకారం...
ఈ విషయంలో స్పందించిన కలెక్టర్... సీడ్ కంపెనీలు ఇటు ఆర్గనైజర్లతో అటు రైతులతో కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఇందులో ఎవరి తరఫున వారు షరతులు పెట్టుకోవచ్చని... అంతిమంగా కుదిరిన ఒప్పందం మేరకు అందరూ నడుచుకోవాలని సూచించారు. ఇందుకు సీడ్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు, నడిగడ్డ రైతు సంఘ నాయకులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నట్లు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు.
నచ్చిన వారే సాగు, వ్యాపారం చేయాలి...
రేపటిలోగా ఒప్పందంలో ఎలాంటి అంశాలను చేర్చాలో లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన త్రైపాక్షిక ఒప్పందం మేరకు నచ్చిన వారు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకోవచ్చని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, నడిగడ్డ రైతు సంఘం అధ్యక్షుడు రంజిత్ కుమార్, ఆర్గనైజర్లు రాజశేఖర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులుగా విజయభాస్కర్ రెడ్డి, ఇతర కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.