జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శని జూరాల ప్రాజెక్టును టీఎస్ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సందర్శించారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. ఎగువ, దిగువ జూరాల కేంద్రాల ద్వారా 70 మిలియన్ యూనిట్లు, శ్రీశైలం నుంచి మరో 70 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అవుతోందని.. వీటి ద్వారా రాష్ట్ర ప్రజల విద్యుత్తు అవసరాలను తీర్చడంలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు.
దిగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్ద 80 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న క్రమంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన అనంతరం ప్రారంభిస్తామన్నారు. ఎగువ జూరాల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని జెన్‌కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం, సీఈ సురేశ్‌కుమార్ ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన చైనా నుంచి మరమ్మతు సామగ్రిని సమకూర్చి విద్యుత్తు ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం : సీఎస్ సోమేశ్ కుమార్