రాష్ట్రంలో నూనెగింజల పంట సాగుకు ప్రోత్సాహమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రెండు ఆయిల్ పరిశ్రమలున్నాయి. తాజాగా ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో మరో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. పాలమూరు జిల్లాలో మూతపడిన బీచుపల్లి ఆయిల్ మిల్లును పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురానుంది.
ఈనెల 18న శ్రీకారం
ఈ ప్లాంట్ ద్వారా .. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయిల్‌ఫాం విస్తరింపజేసేందుకు ఉద్యానశాఖ, ఆయిల్‌ఫెడ్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేశాయి. ఈనెల 18న బీచుపల్లి ఆయిల్ మిల్లు ఆవరణలో మొక్కలు నాటి పునరుద్ధరణ పనులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రత్యేక చొరవ
1990లో ప్రారంభమైన బీచుపల్లి ఆయిల్ మిల్లు ఆర్థిక ఇబ్బందులతో 2003 జూన్‌లో మూతపడింది. మిల్లు మూసివేతకు నిరసనగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు, కార్మికులకు ప్రస్తుత మంత్రి నిరంజన్‌రెడ్డి మద్దతిచ్చారు. ఇప్పుడు ఆయనే... బీచుపల్లి ఆయిల్‌మిల్లు పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
చిరకాల వాంఛ నెరవేరనుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయిల్ మిల్లు దశల వారీగా ప్రారంభం కానున్న దృష్ట్యా... ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛ నెరవేరనుంది. భవిష్యత్తులో ప్రభుత్వం... ఈ ఫ్యాక్టరీని ఆయిల్‌ఫాం క్రషింగ్ యూనిట్‌గా ఆధునికీకరించనుంది. పంటల మార్పిడిలో భాగంగా జిల్లాలో ఆయిల్‌పాం పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వనుంది.
అవే అనువైన ప్రాంతాలు
ఆత్మకూరు, అలంపూరు, గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతాలు అనువైన ప్రాంతాలుగా ఉద్యాన శాఖ గుర్తించింది. వచ్చే ఏడాది సీజన్ నుంచి ఆయిల్‌ఫాం పంట సాగు ప్రారంభించాలనేది లక్ష్యంగా నిర్దేశించింది. పామాయిల్ మొక్కలు, ఎరువులకు నాలుగేళ్లకు హెక్టారుకు 20 వేల రూపాయల రాయితీ ఇవ్వనుంది.
మంచి రోజులు
వెయ్యి మంది రైతులను ఆయిల్ పాం సాగులో ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట, అప్పరావుపేట, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతానికి స్వయంగా తీసుకెళ్లేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధమయ్యారు. త్వరలో ఈ పర్యటన ఉంటుంది. బీచుపల్లి ప్లాంట్ పునరుద్ధరణతో తమకు మంచి రోజులు వస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.