జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో జోగులాంబ వాగు వంతెనపై ఇరవై ఏళ్ల నుంచి పలువురు దుకాణాదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వాగుకు వరద ప్రవాహం పెరిగి అలంపూర్ పట్టణం మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది.
అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. వాగు వంతెనపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పురపాలక అధికారులు వాగు వంతెనపై ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో దుకాణాదారులు అధికారులను అడ్డుకోవడం వల్ల స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
విషయం తెలుసుకున్న అలంపూర్ సీఐ వెంకట్రామయ్య, ఇద్దరు ఎస్సైలు సంఘటనాస్థలికి చేరుకున్నారు. వారి సాయంతో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మూణ్నెళ్ల క్రితమే దుకాణదారులకు నోటీసులు ఇచ్చామని.. స్పందించకపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని పుర అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నూతన విద్యా విధానంతో భారత్కు విశ్వగురువు స్థానం: గవర్నర్