రాత్రి కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించే వారిపై.. కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆదేశించారు. నిత్యావసరాల కోసం ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. కొవిడ్ విజృంభణ దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో.. అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
పీహెచ్సీలలో ప్రతి రోజు కరోనా టెస్ట్‌లను నిర్వహించాలన్నారు. కరోనా బాధితులను ఐసోలేషన్ సెంటర్లో ఉంచి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచాలని డీఎమ్, హెచ్ఓని ఆదేశించారు. కేసుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తే.. సర్పంచ్‌లు ఆయా ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకుంటారని వివరించారు.
కొవిడ్ బాధితులు బయట తిరగవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా.. మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్పర్సన్, మున్సిపల్ ఛైర్పర్సన్, వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ ఔషధాలకు మార్కెట్లో కొరత.. 2 నెలల్లో వినియోగం రెట్టింపు