జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు 30 నిమిషాల్లో 3 లక్షల మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ ఆజీమ్ మొక్కలు నాటారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఎవరి ఇంటి వద్ద వారు మొక్కలు నాటాలని నిర్దేశించినట్లు తెలిపారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇప్పటికే రెండు లక్షల 50 వేలు, సింగరేణి 15 వేలు, అటవీశాఖ 10వేలు, మున్సిపాలిటీ 15వేలు, ఇతర గృహ సముదాయాల్లో 10 వేల గుంతలు తీసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడించారు. దానికి భిన్నంగా కోటి మొక్కల వరకు నాటే విధంగా చూస్తామని కలెక్టర్ తెలిపారు.