ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేస్తామన్నారు. మహదేవపూర్ మండలం గోదావరి తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సూరారం ఇసుక క్వారీలో ఇసుక లోడింగ్ పరిశీలించారు. ప్రభుత్వం రుసుం చెల్లింపు.. ఎంత సామర్ధ్యం మేర ఇసుకను లోడ్ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం..
ఇసుక అక్రమ రవాణాపై చాలా ఫిర్యాదులు వచ్చాయని.. జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాట్లు కలెక్టర్ అబ్దుల్ అజీం వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, క్వారీల్లో అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇసుక మాఫియా, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. భూపాలపల్లి ఆర్డీవో గణేశ్ సెంట్రల్ నోడల్ అధికారిగా ఉంటూ.. పోలీస్, రెవెన్యూ, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తారని వెల్లడించారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 50 లారీలను అధికారులు సీజ్ చేశారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?