రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన గ్రావిటీ కాల్వల నిర్మాణానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి అటవీ మార్గం ద్వారా నిర్మించిన గ్రావిటీ కాల్వకు ఇరు పక్కల సిమెంట్‌తో లైనింగ్ ఏర్పాటు చేశారు. లక్ష్మీ పంపుహౌస్ మోటార్ల నడిచే సమయంలో గోదావరి జలాలు గ్రావిటీ కాల్వల వెంట పరుగులు పెట్టి సరస్వతీ బ్యారేజీలో కలుస్తాయి.
కానీ.. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రావిటీ కాల్వ రెండు ప్రాంతాల్లో దెబ్బతింది. లక్ష్మీ పంపుహౌస్ డెలివరీ ఛానల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్కన తారు రహదారి కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. దీనివల్ల లైనింగ్ నిర్మాణాల్లో మట్టి కూరుకుపోయింది.
లైనింగ్ నిర్మాణాల ఎగువన.. రహదారి రెండుగా చీలడం వల్ల దాని సమీపంలో ఏర్పాటు చేసిన గ్రావిటీ లైనింగ్ పెచ్చులు ఊడిపోయాయి. భారీ వర్షాలకు రహదారి సుమారు 5 మీటర్ల మేర లోతుగా కోతకు గురైంది. వరదలు వచ్చిన ప్రతిసారి ఇదే పునరావృతమవుతోంది. గ్రావిటీ కాల్వ సంస్థ మెగా ఇన్ఫ్రా వెంటనే మరమ్మతులు చేపట్టింది. మరమ్మతుల కారణంగా గ్రావిటీ కాల్వ రహదారులను అధికారులుమూసివేశారు.
లక్ష్మీ పంపుహౌస్ నుంచి సరస్వతి బ్యారేజీ వరకు కుడి, ఎడమ రెండు వైపుల తారు రహదారి నిర్మాణాలు చేపట్టారు. ఈ రహదారుల వెంట నిత్యం పలు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గ్రావిటీ కాల్వ రెండు చోట్ల దెబ్బ తినడం వల్ల కాల్వ రహదారులను ముందస్తుగా సంస్థ ప్రతినిధులు మూసివేశారు.