జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి క్లబ్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ కృష్ణా-గోదావరి నది పరివాహక ప్రాంతం పునరుజ్జీవన కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన పనులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు 132 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ఏడు మండలాల్లో 90 గ్రామాలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆయా గ్రామాల్లో నేల కోతకు గురి కాకుండా భూగర్భజలాలు పెరిగేలా నేల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులను అభివృద్ధిపరచుటకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. అదేవిధంగా ఏడు మండలాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చేందుకు కెపాసిటీ బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై పరిశోధన జరిగేలా పరిశోధన వసతులను కల్పించాలని వెల్లడించారు. వీటికి అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ నగేష్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. సమావేశంలో భూపాలపల్లి ఆర్డీవో వై.వి గణేష్, ఏడీఏ సత్యంబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.