జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కాలనీలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అబ్దుల్ అజీం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు చర్యగా అతను కలిసిన తన భార్య, కూతురుతో కలిపి మొత్తం 39 మందిని గుర్తించామన్నారు. వారిలో 21 మందిని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి, మరో 18 మందిని కాళేశ్వరం క్వారంటైన్ కేంద్రానికి పంపించామని తెలిపారు.
ఇంటికే సరుకులు
మొత్తం సుభాష్కాలనీ 850 ఇళ్లు ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వారికి కావల్సిన నిత్యావసర సరుకులు, పండ్లు పంపిస్తామన్నారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సుభాష్ కాలనీ, కాళేశ్వరంలో ఒక కిలోమీటర్ మేర కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించి లాక్డౌన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
భయం వద్దు..
ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావొద్దని, జిల్లాలో ఒకటే పాజిటివ్ కేసు నమోదైందని వివరించారు. పోలీసు, వైద్యశాఖ, జిల్లా అధికారులు అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని అన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.
ఇదీ చూడండి : కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు