Four People Arrested for Transferring Money to Maoists : మావోయిస్టులకు డబ్బులు, ఇతర వస్తువులు తరలిస్తున్న నలుగురు బీడీ కాంట్రాక్టర్లను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.76 లక్షల 57 వేల నగదు, రూ.2 లక్షల విలువ చేసే వివిధ సామగ్రి, మెడికల్ కిట్లు, జిలెటిన్ స్టిక్స్, నాలుగు సెల్‌ఫోన్లు, ఓ ట్యాబ్, మూడు స్మార్ట్ వాచీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కాటారం అటవీ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా నలుగురు వ్యక్తులతో పాటు భారీ మొత్తంలో నగదు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ తదితర అనుమానాస్పద వస్తువులు లభించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కరీంనగర్‌కు చెందిన అబ్దుల్ అజీజ్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, జనగామ రాఘవ్, కౌసర్ అలీలుగా గుర్తించామన్నారు. వీరంతా బీడీ ఆకు కాంట్రాక్టర్లు, అందులోని సిబ్బంది అని వివరించారు.
బీడీ కాంట్రాక్టుల కోసం మామూళ్లు..: నిందితులంతా ఛత్తీస్‌గఢ్‌లో తమ బీడీ కాంట్రాక్టు నిర్వహించుకోవడానికి మావోయిస్టులకు ప్రతి సంవత్సరం డబ్బులు, వస్తువులు మామూళ్ల రూపంలో సరఫరా చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. గత సంవత్సరం రూ.13 లక్షలు మామూళ్లుగా ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు.
''నిన్న మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న నలుగురిని కాటారం పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక స్కార్పియో వాహనంలో నలుగురు వ్యక్తులు పెద్ద మొత్తంలో నగదు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సహా వివిధ సామగ్రి తరలిస్తూ పట్టుబడ్డారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తే.. నిందితులు కరీంనగర్‌కు చెందిన బీడీ కాంట్రాక్టర్లుగా గుర్తించాం. వీరు ఛత్తీస్‌గఢ్‌లో తమ బీడీ కాంట్రాక్టు నిర్వహించుకోవడానికి మావోయిస్టులకు ప్రతి సంవత్సరం డబ్బులు, వస్తువులు మామూళ్ల రూపంలో సరఫరా చేస్తున్నారు. గత సంవత్సరం రూ.13 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నాం. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.'' - సురేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ
Maoists Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
'మా కమాండర్‌కు ఏమైనా జరిగితే మీదే బాధ్యత' ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ