జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్న ఏర్పాటులో భాగంగా అన్నదాతలు పండిస్తున్న పంటల వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. పంటల సాగు వివరాల సేకరణలో రైతుబంధు సభ్యులు వ్యవసాయ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
రైతులు పండించిన పంటలకు ఎరువులను అందుబాటులో ఉంచడం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెటింగ్ సౌకర్యం కలిగించడం, పంట నిల్వ చేసేందుకు గోడౌన్ లను సిద్ధం చేసేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతుల వివరాలు అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.