బొగ్గు గనుల్లో పని చేసే ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యూటీని చెల్లించేలా 2018 మార్చి 29న కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే 2018 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు మాత్రమే పెంచిన గ్రాట్యూటీ వర్తిస్తుందని యాజమాన్యాలు తిరకాసు పెట్టాయి.
వేతన సవరణ కాలపరిమితి పదేళ్లు ఉండటంతో వారికి 2017 జనవరి నుంచి అమలు చేస్తున్నామని యాజమాన్యాలు వాదనను వినిపించాయి. దీన్ని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగులకు వేర్వేరుగా గ్రాట్యూటీని వర్తింపజేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారులు, కార్మికులకు ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని ఒత్తిడి తెచ్చాయి. ఈ నెల 5న జేబీసీసీఐ స్టాండర్డైజేషన్ సమావేశంలో మరోసారి దీనిపై కోల్‌ఇండియా యాజమాన్యంతో చర్చించాయి. కార్మికులకు కూడా 2017 జనవరి నుంచి పెరిగిన గ్రాట్యూటీని అమలు చేయాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు కోల్ ఇండియాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బొగ్గు పరిశ్రమలకు కోల్‌ఇండియా ఆదేశాలు జారీ చేసింది. 2017 జనవరి 1 నుంచి పెరిగిన గ్రాట్యూటీని అమలు చేయాలని అందులో పేర్కొంది. గతంలో రూ.10 లక్షల వరకు సీలింగ్ ఉన్న గ్రాట్యూటీని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోగా బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు వర్తింపజేస్తున్నారు.
3 వేల మందికి ప్రయోజనం
తాజా నిర్ణయంతో సింగరేణిలో 3 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు సింగరేణిలో 2018 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు మాత్రమే పెంచిన గ్రాట్యూటీని వర్తింపజేస్తున్నారు. ప్రస్తుత ఆదేశాలతో 2017 జనవరి 1 నుంచి 2018 ఫిబ్రవరి 28 వరకు ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు పెంచిన గ్రాట్యూటీని వర్తింపజేయనున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు 3000 మంది వరకు ఉద్యోగ విరమణ పొందారు. ఆ 14 నెలల కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు రూ.10 లక్షల గ్రాట్యూటీ ప్రకారం మాత్రమే చెల్లించారు. పెరిగిన గ్రాట్యూటీ ప్రకారం వారి సర్వీసు ఆధారంగా అదనంగా రూ.10 లక్షల వరకు వర్తింపజేయనున్నారు.
ఇదీ చూడండి : 0.03 టీఎంసీలకు చేరిన నిజాం సాగర్ నీటిమట్టం