జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ధాన్యం కొనుగోలు షెడ్, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శంకుస్థాపన చేశారు. కొనుగోలు షెడ్, సీసీ రోడ్లకు రూ. 2 కోట్లు, రూ. 16 లక్షలు చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజయ్య విమర్శలు గుప్పించారు. రైతుల పాలిట శాపంగా నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయని... వాటిని కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు పెద్దపీట
రాష్ట్రంలో రైతులకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజయ్య పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, నాణ్యమైన ఎరువులు, గిట్టుబాటు ధర అందిస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఆయన అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం.. రైతులకు నష్టం కలిగించేలా కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. నెల రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు ఉద్యమిస్తున్నా.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: రామసేతు : అన్నదాతను ఆదుకునే ఆపద్బాంధువు