ప్రత్యామ్నాయ ప్రాధాన్యత పంటలు సాగుచేసి రైతులు లక్షలు సంపాదించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా శమిర్పేటలో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రైతులు వానాకాలంలో వరి, కంది పంటలను సాగు చేయాలని సూచించారు. గతేడాది వానాకాలంలో మొక్కజొన్న సాగు చేశారని, ఈసారి వరి, కంది పంటలను వేయాలని రైతులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
వానాకాలంలో మొక్కజొన్న పంట వేస్తే కత్తెర పురుగు సోకి దిగుబడి తగ్గుతుందని, పైగా బూజు పట్టి మొలకెత్తకుండా ఉంటుందని వచ్చే నష్టాలను రైతులకు సవివరంగా వివరిస్తూ... వానాకాలం బదులుగా యాసంగిలో మొక్కజొన్న వేయాలని ప్రభుత్వం సూచిస్తోందని ఆయన చెప్పారు. యాసంగిలో వరి పంట తగ్గించి, మొక్కజొన్న పంట వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అన్నదాతలకు సూచించారు. రైతులతో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను పండిస్తామని ప్రమాణం చేయించారు.
ఇవీ చూడండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం