MLA Muthireddy and his Daughter Controversy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి.. ఆయన కుమార్తె తుల్జా భవానిరెడ్డికి మధ్య గత కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. తన కుమార్తె, అల్లుడు ఆయన కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
తన కార్యక్రమాలు అడ్డుకోకుండా కుమార్తె, అల్లుడిని నిరోధించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి, అల్లుడు పి.రాహుల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, జనగాం, సిద్దిపేట డీసీపీలకు నోటీసులు ఇచ్చింది.తదుపరి విచారణను జులై 25కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్యే కుమార్తె తుల్జా భవానీ రెడ్డి తన సంతకాన్ని.. తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోర్జరీ చేశారని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని తెలిపారు. ఇదే విషయంపై ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరు పైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తె తుల్జా భవానీని రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
ప్రహారి కూల్చివేత.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. భూమిని తన పేరిట ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారంటూ తండ్రి యాదగిరిని భవానీ బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మున్సిపాలిటీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 1200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగించారు. ఎమ్మెల్యే అయి ఉండి మా నాన్న ఇలాంటి పని చేసి ఉండకూడదని తెలిపారు. తన పేరుపై ఉన్న భూమిని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించేస్తానని.. చేర్యాల మున్సిపాలిటీకి స్థలం రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. ఎమ్మెల్యే.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. భూమిని కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కలెక్టర్ గారికి అప్పగిస్తాని.. చేర్యాల ప్రజలు క్షమించాలి' అని తుల్జా భవానీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: