తొమ్మిది నెలలు నిండాయంటే... ఎప్పుడెప్పుడు కాన్పవుతుందా అని మహిళలు ఎదురుచూస్తుంటారు. సాధారణ ప్రసవం అంటే నొప్పికి భయపడి సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్నవారు ఎంతో మంది. కానీ వీటి వల్ల ప్రసవం అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యలపై వారు దృష్టి సారించడం లేదు. ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపుతున్నారు జనగామ జిల్లా వైద్యులు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు సాధారణ ప్రసవాల వైపే మొగ్గుచూపేందుకు కృషి చేస్తున్నారు.
ఒకేరోజు 16 సుఖ ప్రసవాలు
జనగామలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్ర వైద్యులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే గర్భిణులకు శారీరక వ్యాయామంపై అవగాహన కల్పిస్తూ, సాధారణ కాన్పులు చేస్తున్నారు. గతవారం ఒకేరోజు 16 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. గర్భిణీలకు సాధారణ ప్రసవాలపై అవగహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైందని వైద్యులు చెబుతున్నారు.
ముందు నుంచే సిద్ధం
సాధారణ చెకప్‌లకు వచ్చినప్పటి నుంచే గర్భిణీలను సుఖ ప్రసవాల వైపు మొగ్గు చూపేలా శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గతంలో కంటే సుఖ ప్రసవాల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు.
- ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు