ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించిన ఆయన... రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని మండిపడ్డారు. కరోనా బాధితులకు ఆసుపత్రిలో ఐసోలేషన్ చేయకుండా... హోం క్యారంటైన్ చేస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలను 350 పడకల సూపర్ స్పెషాలిటీ అసుపత్రులగా మారుస్తామని చెప్పిన కేసీఆర్... నాలుగేళ్లు గడిచిన ఎలాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు.
వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా ఉండడం చూస్తే బాధేస్తోందని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంతోనే ఉద్యోగాలు అన్న మంత్రి ఈటల రాజేందర్ తన శాఖలో కూడా ఖాళీలను భర్తీ చేయకుండా ఉత్సవ విగ్రహంలా తయారయ్యారని దుయ్యబట్టారు. జనగామ ఒక్క ఆసుపత్రిలోనే 36 ఖాళీలు ఉన్నాయని... ఇక రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రాలు దేవాలయాలు అయితే డాక్టర్లు దేవుళ్లని తెరాస ప్రభుత్వం దేవుళ్లు లేని దేవాలయాలగా మారుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాంగా రాఘవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా