Best Tourism Villages Telangana 2023 : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పెంబర్తి గ్రామ ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్రం పెంబర్తి గ్రామాన్ని బెస్ట్ టూరిజం విలేజ్‌గా గుర్తించింది. జనగామ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలోని హస్త కళాకారుల నైపుణ్యం అద్భుతం.. అపురూపం. వీరి చేతి నుంచి తయారైన దేవతా ప్రతిమలు చూస్తుంటే.. సాక్షాత్తు దేవదేవుడే దివి నుంచి భువికి దిగివచ్చాడా అని అనిపించక మానదు.
అత్యద్భుత పని తనంతో.. పెంబర్తి కళాకారులు రూపొందించిన కళాకృతులు నయనానందకరంగా నిలుస్తాయి. ఒక్కసారి చూస్తే చాలు.. మనస్సు దోచేలా ఆకృతులను తయారు చేయడం ఈ కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. దేశ, విదేశాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రాలు మొదలుకొని గ్రామ స్థాయి వరకు పలు ఆలయాల్లో దేవదేవుడి ఆకృతులు పెంబర్తి హస్త కళాకారుల చేతుల్లోనే రూపుదిద్దుకున్నాయి.
Pembarthi, Chandlapur Best Tourism Villages Telangana : అమెరికా టెక్సాస్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కిరీటం తయారు చేసింది పెంబర్తి కళాకారులే. వేములవాడ రాజన్న కోవెలలో వెండి ద్వారాలు, బాసర సరస్వతీ దేవి విగ్రహం.. శ్రీకాళహస్తి ధ్వజ స్తంభం తొడుగు.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు, ద్వారాలు రూపుదిద్దుకుంది ఇక్కడే. వివాహాల్లో అవసరమైన కాళ్లు కడుగు పళ్లెం.. ఇళ్లల్లోకి అవసరమైన దీపపు కుందులు.. ఇంకా అనేకానేక వస్తువులు ప్రాణం పోసుకునేదిక్కడే. ఇత్తడి చెంబులు, గ్లాసులు, కాకతీయ కళాతోరణం, నెమలి, హంస ఆకృతులు, పూలకుండీలు అందంగా తయారు చేయడంలో వీరికి సాటి, పోటీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
Best Tourism Village Pembarthi 2023 : ప్రస్తుతం ఇక్కడ 50 కుటుంబాలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రతిమ.. లేదా వస్తువు రూపాన్ని ఊహించుకుంటూ.. దానికి అచ్చు తయారు చేసి కరిగించిన ఇత్తడితో రూపం తెచ్చి.. తమకు వారస్వతంగా అబ్బిన హస్తకళా నైపుణ్యంతో ఆ ఆకృతికి ప్రాణం పోసి సజీవ శిల్పంలా తయారు చేస్తారు పెంబర్తి కళాకారులు. సన్మానాలు.. సత్కారాల్లో ప్రముఖులకు జ్ఞాపికలివ్వడం మన సాంప్రదాయం. ఈ జ్ఞాపికలను చూడముచ్చటగా తయారు చేసేది.. పెంబర్తి కళాకారులే. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే దాక ఆకృతులను అందంగా మలచడంలో కళాకారులు పోటీ పడుతుంటారు.
ఈ కళాకారులు తమ ప్రతిభకు గుర్తింపుగా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి ఎన్నో ప్రశంసలు.. సత్కారాలు, సన్మానాలు కూడా అందుకున్నారు. దిల్లీతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో పెంబర్తి హస్త కళాకృతులతో ప్రదర్శనలు సైతం నిర్వహించారు. నిజాం నవాబుల పాలనకు ముందే.. ఇక్కడి వారు తొలుత వంటింటి పాత్రలు తయారు చేసేవారు. ఆ తర్వాత కాలక్రమేణా వంటింటి పాత్రల నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అద్భుత కళాఖండాలు సృష్టిస్తూ గ్రామ కీర్తిని నలుచెరగులా వ్యాపింపచేశారు.. బెస్ట్ టూరిజం విలేజ్‌గా నిలిచారు.
Bhoodan pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ఉత్తమ పర్యాటక పురస్కారం అందుకున్న పోచంపల్లి