జనగామలో కలకలం రేపిన ఎలుగుబంటిని అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా పట్టుకున్నారు. బస్టాండ్ సమీపంలో చెట్టెక్కిన ఎలుగుబంటికి.. మత్తు ఇంజిక్షన్లు ఇచ్చి వలతో బంధించారు.
అసలేం జరిగిందంటే...
ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో సిద్దిపేట రోడ్డులోని డీసీపీ కార్యాలయం వద్ద ఎలుగుబంటి కనిపించింది. అక్కడి నుంచి బస్టాండ్‌లోకి వచ్చి కాసేపు హల్‌చల్ చేసింది. అనంతరం డిపో సిబ్బంది వెంబడించగా... సమీపంలోని ఓ చెట్టు ఎక్కింది.
స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా... వరంగల్ నుంచి ఫారెస్ట్ రెస్క్యూ టీం అధికారులు రంగంలోకి దిగారు. అటవీ అధికారులు ఎలుగుకు రెండు మత్తు ఇంజక్షన్లను వదిలారు. సుమారు 30నిమిషాల తరువాత మత్తు ప్రభావంతో చెట్టుపై నుంచి దిగింది.
ఆ తర్వాత అక్కడే ఉన్న గోడపై ఎక్కింది. మళ్లీ స్థానికులంతా భయానికి గురయ్యారు. భల్లూకం పైకి మరో మూడు మత్తు ఇంజక్షన్లను వదిలారు. మరోసారి బస్‌డిపోలోకి ఎలుగుబంటి దూరింది. రెండుసార్లు వల విసిరినా తప్పించుకుంది. ఎట్టకేలకు మత్తు ప్రభావంతో అధికారులకు చిక్కింది.
బోనులో బంధించిన తరువాత ఏటూరునాగారం తాడ్వాయ్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నీరు, ఆహారం లభించనప్పుడే ఇలా జనావాసాల్లోకి వస్తాయని తెలిపారు. 8గంటల ఉత్కంఠ తరువాత ఎట్టకేలకు పట్టుకోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. రద్దీగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలోనే ఎలుగు సంచరించినా... ఎవరినీ గాయపరచలేదు.
ఇదీ చూడండి: భువనగిరిలో మా గెలుపు ఖాయం: కోమటిరెడ్డి బ్రదర్స్