EC investigation in Jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూలో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ ప్రారంభమైంది. 2018 సాధారణ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగా.. తాళం చెవులు దొరకలేదు. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హైకోర్టుకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.
ఈ విచారణకు ఎవరెవరు హాజరయ్యారు: తాళం చెవుల మాయంపై విచారణ జరిపాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ విచారణకు అప్పటి ఎన్నిక్లలో పాల్గొన్న అధికారులు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ముగ్గురు అధికారులు హాజరుకాగా ఆ రోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏం జరిగింది..? తాళం చెవులు ఎలా మాయమైపోయాయి..? దీనికి బాధ్యులు ఎవరనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ విచారణకు జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్లు షేక్ యాస్మిన్ బాషా, డాక్టర్ శరత్, గుగులోతు రవిలు హాజరయ్యారు. వీరితో పాటు కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. మరో 40 మంది సిబ్బందిని అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ అవుతున్నందున జేఎన్టీయూ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం సేకరించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించనున్నారు.
2018 నుంచి ఇప్పటి వరకు విచారణ ఎలా సాగింది: జగిత్యాల జిల్లాలోని ధర్మపూరి నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. కేవలం తక్కువ ఓట్లతో గెలవడంతో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భావించారు. దీంతో ఆ నియోజక వర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలు సక్రమంగా జరగలేదని కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు విచారణ జరగగా.. ఇటీవలే అప్పటి ఈవీ ప్యాడ్లు ఉన్న స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు వెళితే తాళాలు పోయాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. దీంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి పిటిషన్ వేశారు. ఈసారి విచారణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. దీంతో ఈరోజు పూర్తిగా విచారణ చేపట్టి జరిగిన తప్పిదాలను కోర్టుకు వెల్లడించనుంది.
ఇవీ చదవండి: