Rahul Gandhi Speech at Jagtial : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరీ బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. జగిత్యాలలో యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. ఈసారి దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేసీఆర్ నియంతలా, రాజులా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే ప్రజలతో తమ పార్టీకి ఉన్న ప్రేమానుబంధాలు దశాబ్దాల నాటివని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల కాలం నుంచి ప్రజలతో తమకు మంచి అనుబంధం ఉందని రాహుల్ తెలిపారు.
Congress Bus Yatra in Jagtial : ఈ సందర్భంగా ఇక్కడి బీఆర్‌ఎస్, దిల్లీలో బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం పెట్టిన అన్ని బిల్లులకూ బీఆర్‌ఎస్ పార్టీ మద్దతిచ్చిందని తెలిపారు. బలహీనవర్గాల జనాభా లెక్కలు ఉండాలని కేంద్రాన్ని అడిగానని.. అయితే ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్ సిద్ధంగా లేరన్నారు. దేశాన్ని నడిపించే ఉన్నతాధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాల వారేనన్న రాహుల్‌గాంధీ.. బడ్జెట్‌లో ఓబీసీలకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆలోచించాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో ఓబీసీలు 50 శాతం వరకు ఉన్నారని.. తాము అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుల గణన చేపడతామని రాహుల్ స్పష్టం చేశారు. బలహీన వర్గాల జన సంఖ్య మేరకు వారికి బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. రోగ నిర్ధారణ చేశాకే రోగికి చికిత్స అందించాలని ఈ ప్రభుత్వాలు మరిచాయని ఎద్దేవా చేశారు. కుల గణన వల్లే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందుతాయన్నారు. ఈ క్రమంలోనే ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని.. దొరల కోసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా పులులేనన్న ఆయన.. ఒకేసారి గర్జిస్తే అందరూ పరిగెత్తాలన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే నిలబడుతుందని.. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‌లను శాసనసభకు పంపే బాధ్యత ప్రజలదేనని రాహుల్ స్పష్టం చేశారు.
Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది'
"రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. మీకు నాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. ప్రేమాభిమానాలతో కూడిన బంధం. దిల్లీలో బీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతిస్తుంది. ఇక్కడ ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుంది. జనాభా ఎంత ఉందనే విషయం చెప్పడం మోదీకి, కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. బలహీన వర్గాల బడ్జెట్‌పై 90 మంది అగ్రవర్ణాల అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. మీ జేబుల్లో నుంచి సొమ్ము లూటీ చేసి అదానీ లాంటి వాళ్లకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతాం. రాష్ట్ర అభివృద్ధి కుల గణనతోనే ప్రారంభమవుతుంది." రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత