Korutla Floods 2023 : జగిత్యాల జిల్లాలో ప్రధాన పట్టణమైన కోరుట్లలో చెరువులు, కాలువలు ఆక్రమణకు గురి కావటంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లుగా కురుస్తున్న భారీ వర్షానికి స్థానిక మద్దుల చెరువు నీరు రోడ్లు, కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇటీవలి భారీ వర్షానికి రోడ్లపై 5 అడుగుల మేర నీరు ప్రవహించగా సుమారు 150 ఇళ్లు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంట్లోని సకల సామగ్రి, కార్లు, బైకులు దెబ్బతిన్నాయి. పలు ఇళ్ల ప్రహరీలు కూలిపోగా.. రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'' ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో టీవీలు, ఫ్రిజ్‌లు, మొత్తం సామాన్లు పాడైపోయాయి. పాములు, తేళ్లు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలతో ఇండ్లు మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇదే సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. మాకు అధికారులు శ్వాశత పరిష్కారం చూపాలని కోరుతున్నాం.-స్థానికులు
Flood problems in Korutla : మద్దుల చెరువు- మినీ ట్యాంక్‌బండ్ మత్తడి కింద సుమారు 16 అడుగుల వెడల్పుతో కాలువలు గతంలో నిర్మించారు. ఇరువైపులా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించటంతో కాలువ 3అడుగులకు కుచించుకపోయింది. రవీంద్ర రోడ్‌లోని తాళ్ల చెరువు పూర్తిగా నిండిన తర్వాత వరద నీరు బయటికి వెళ్లేందుకు 10నుంచి 14 అడుగుల మేర కాలువ ఉండేది. సుమారు 17 ఏళ‌్ల కింద కాలువను పూర్తిగా పూడ్చి సిమెంట్ రోడ్డుగా మార్చారు. పలు చోట్ల కాలువను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో మత్తడి కిందున్న కాలువ ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలనీలు జలమయం అవుతున్నాయి. దీంతో తమకి దిక్కుతోచని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
'' నిరు పేదలు గుడిలా భావించే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ బాధను మీరు పట్టించుకొని నీట మునిగే ప్రాంతాల వాసులకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. - రాజశేఖర్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు
మద్దుల చెరువు, తాళ్ల చెరువు మత్తడి కాలువల ఆక్రమణలతో ఏటా వానాకాలంలో వరదలు ఇళ్లలోకి పోటెత్తుతున్నాయి. రోడ్ల కింది నుంచి అంతర్గత కాలువలు నిర్మించి మత్తడి కాలువకు అనుసంధానిస్తే వరద సమస్యకు కొద్ది మేర పరిష్కారం లభిస్తుందని స్థానికులు సూచిస్తున్నారు. లేదంటే చెరువు పై భాగంలో పట్టణం విస్తరించటంతో మరింత వరదలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింది ప్రాంతంలోని ప్రకాశం రోడ్, ఝాన్సి, కల్లూర్, ఆదర్శనగర్, రవీంద్ర రోడ్లలోని, ఇతర కాలనీలో నీట మునిగే ప్రమాదాలున్నాయంటున్నారు. మరోవైపు త్వరలో కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరిస్తామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య తెలిపారు.
'' వరదలతో ఇబ్బంది పడుతున్న కాలనీలలో త్వరలోలనే చర్యలు చేపట్టి ప్రత్యేక నిధులతో కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరిస్తాం. -ఛైర్ పర్సన్ లావణ్య
- ఇవీ చదవండి
- TS Legislative Council Sessions 2023 : శాసనమండలిలో వర్షాలు, వరదలపై వాడీవేడిగా చర్చ
- Central team visit to bhadrachalam Flood Damage : భద్రాచలంలో కేంద్ర బృందం పర్యటన..వరద ప్రాంతాల పరిశీలన
- Telangana Assembly Sessions 2023 : వరద నష్ట తీవ్రతపై అసెంబ్లీలో ప్రకటన.. ఏయే రంగాల్లో ఎంత నష్టం వాటిల్లిందంటే?