జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు సమయంలోనే తరుగు పేరుతో బస్తాకు రెండు కిలోలు తీసుకున్నారు. ప్రస్తుతం ధాన్యం అమ్మినా అన్నదాతలకు వారి ఖాతాల్లో నగదు జమకావడంతో బ్యాంక్‌కు ఎంతో ఆశగా వెళ్లారు. తీరా రావాల్సిన డబ్బుల కన్నా తక్కువ రావడంతో.. ఖంగుతిన్నారు.
బ్యాంకు అధికారులను ప్రశ్నించగా మిల్లర్లు నగదు తగ్గించి జమచేశారని చెబుతున్నారని కర్షకులు వాపోయారు. దీనిపై సొసైటీ అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నాదాతల ఆందోళన
ఒక్క వెల్లుల్లలో సొసైటీ తరపున 14వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ గ్రామం నుంచి 30 లారీల ధ్యాన్యం తరలించగా.. లారీకి లక్ష చొప్పున 30 లక్షల రూపాయల వరకు తగ్గించేశారని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోయామన్నారు.
తగ్గిన నగదు జమ చేయాలంటూ రైతులు సంయుక్త కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మిల్లర్లు, సొసైటీ అధికారులు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు స్పందించాలి..
ఆరుగాలం కష్టించి పండిస్తుంటే తమకు అడుగడునా అన్యాయం జరుగుతోందన్నారు. విత్తనాల వద్ద నుంచి కూలీలు, కోతల వరకు సుమారు ఎకరానికి 20 వేల రూపాయలు ఖర్చు చేశామని కర్షకులు తెలిపారు. మిల్లర్ల దోపిడీ వల్ల తమకు ఒక్క రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదని.. ఇక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్ధం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని దళారులకు అమ్మకుండా సొసైటీల్లో విక్రయిస్తే ఇక్కడా నష్టపోయామని వాపోయారు.
చెప్పే తరుగు తీశాం..
సహకార సంఘం అధ్యక్షుడు మాత్రం తరుగు విషంయం రైతులకు చెప్పే కొనుగోలు చేశామని తెలిపారు. తమ వద్ద తడిసి మొలకలు వచ్చిన ధాన్యం బస్తాల పోటోలు ఉన్నాయని.. రైతుల అనుమతి తోనే నగదును మిల్లర్లు తగ్గించి వేశారని.. అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు అడ్డం తిరగడం మంచిది కాదని మెట్‌పల్లి సహకార సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మిల్లర్లతో చర్చించి కోత విధించన నగదుని తిరిగి ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండీ: ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టాలి.. ప్రతి ఎకరాను తడపాలి: మంత్రులు