గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ కార్యాలయంలో జాతిపిత జయంతి( Gandhi jayanthi 2021) వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం మెట్పల్లి పురపాలక ఛైర్పర్సన్ సుజాత, ఖాదీ కార్యకర్తలు, ఉద్యోగులు నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఖాదీ కార్యాలయంలో మహాత్ముని చిత్రపటం ముందు అఖండ సూత్ర యజ్ఞాన్ని ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిరంతరాయంగా రాట్నంతో దారం వడికి... ఆ దారాన్నే మాలగా మార్చి మహాత్ముని( Gandhi jayanthi 2021) మెడలో వేసి నివాళులు అర్పించనున్నారు.
ఏటా గాంధీ జయంతి రోజున అఖండ సూత్ర యజ్ఞం నిర్వహిస్తారు. తాము వడికిన దారాన్ని పూలమాలగా తయారుచేసి... ఆ మహాత్ముని మెడలో వేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖాదీ వస్త్రాలను అందరూ ధరించేలా వినూత్న రీతిలో ఆకట్టుకునే డిజైన్లలో వస్త్రాలు తయారు చేసి... విక్రయిస్తున్నట్లు మేనేజర్ మాధవ్ తెలిపారు. మహాత్ముడు చూపిన దారిలో నడుస్తూ ఖాదీని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు.
గాంధీ జయంతిని మేము ఒక పండుగలాగా జరపుకుంటాం. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా రాట్నం తిప్పుతూ... దాని వచ్చిన దారాన్నే మాలగా తయారుచేసి... మేం గాంధీ చిత్రపటానికి వేసి సంతోషిస్తాం.
-రజిత, ఖాదీ కార్యకర్త
తెలంగాణలో మెట్పల్లి ఖాదీ చాలా ప్రసిద్ధమైంది. బట్ట తయారీలోగానీ... క్వాలిటీలోగానీ చాలా బాగుంటుంది. మార్కెట్కు తగ్గట్టు మేం ఈ బట్టను తయారుచేస్తున్నాం. యువకులు, అందరూ వేసుకునేలా తయారుచేస్తున్నాం. అంతేకాకుండా పండుగల సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్స్ ఇచ్చుకుంటూ... దీని అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం.
-శ్రీనివాస్, ఖాదీ ఉద్యోగి.
ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ పరిశ్రమలో అఖండ సూత్ర యజ్ఞం... అనగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందరం కార్యకర్తలం ఈ చరఖాను ఆపకుండా నడిపించి... దాని ద్వారా వచ్చే దారాన్ని గాంధీ మెడలో వేస్తాం. గాంధీ జయంతిని మేం ఒక పండుగలాగా చేసుకుంటాం. గతంలో ఖాదీ అంటే కేవలం రాజకీయ నాయకులు వేసుకునే ఖద్దరు బట్టలు అనుకునేవారు. కానీ కాలానుగుణంగా నేటి యువతను కూడా ఆకర్షించేవిధంగా అన్నిరకాల డిజైన్లు, మార్కెట్లో లభించే వస్త్రాలకు పోటీగా మేం ఖాదీ వస్త్రాలు తయారుచేస్తున్నాం.
-మాధవ్, ఖాదీ మేనేజర్ మెట్పల్లి
ఇదీ చదవండి: pocharam srinivas reddy tribute to gandhi: గాంధీ బాటలోనే నడుస్తున్నాం: పోచారం