Change of employee posting: ఉద్యోగుల బదలాయింపు 9 ఉమ్మడి జిల్లాలకు ఒకేసారి చేయాలని ప్రభుత్వం అన్ని శాఖ కార్యదర్శులు, అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జోనల్ విధానం కింద మొదటగా ఆర్డర్ టు సర్వ్ కింద ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత జిల్లాలు, జోన్‌లు, బహుళ జోన్‌లకు పంపించేందుకు ప్రభుత్వం ఈనెల 8 నుంచి కార్యాచరణ చేపట్టింది. మొదటగా వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ మొదలైంది. ఆయా జిల్లాల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించి, ఐచ్ఛికాలను స్వీకరించారు. జిల్లా స్థాయి కేటాయింపుల కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం వారికి ఈ నెల 15 నుంచి ఉత్తర్వులు జారీ కావాలి.
ఎన్నికల కోడ్ దృష్ట్యా...
మరోవైపు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ దృష్ట్యా అక్కడ ఉద్యోగుల బదలాయింపులను ప్రారంభించలేదు. ఆ 5 జిల్లాల్లో ఈనెల 14తో స్థానిక సంస్థల కోడ్ ముగుస్తుంది. అక్కడ 15 నుంచి ఉద్యోగుల బదలాయింపులను చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. 15న సీనియారిటీ జాబితాలు, 16న ఐచ్ఛికాలు, 17 నుంచి 21 వరకు కేటాయింపుల కమిటీ సమావేశాలు జరుగుతాయి. మొదటి 4 జిల్లాలు, ఆ తర్వాత చేపట్టిన 5 జిల్లాలకు కలసి 22 నుంచి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తంగా 9 జిల్లాలకు సంబంధించి ఒకే రకమైన మార్గదర్శకాలతో కేటాయింపులు జరగనున్నాయి.
ఒక్కో జిల్లాలో వేలకు పైగా ఐచ్ఛికాలు....
ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ మొదలైన 4 జిల్లాల్లో శనివారం వరకు 24 వేలకు పైగా ఐచ్ఛికాలు బదలాయింపుల కోసం ఉద్యోగుల నుంచి వచ్చాయి. ప్రతీ ఉమ్మడి జిల్లాలో సగటున 6 వేల మందికిపైగా ఉద్యోగులు సొంత జిల్లాల్లో పోస్టింగ్ కోరారు. దీనిపై 4 జిల్లాల్లోని కేటాయింపుల కమిటీ సమావేశాలు నిర్వహించాయి. ఉమ్మడి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, అందులోని కొత్త జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఇందులో పాల్గొని ఉద్యోగుల కేటాయింపుల గురించి చర్చించారు. ముందుగా ఉద్యోగులకు సంబంధించిన బదలాయింపుల ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన కేటాయింపుల ప్రక్రియ విడిగా సాగుతుంది. అది పూర్తయ్యాక వ్యక్తిగత కేటాయింపులపై ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేస్తుంది.
ఇదీ చదవండి: Suicide: భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య