ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో కృష్ణా జిల్లా తక్కెళ్లపాడుకు చేరుకున్న ఆ రాష్ట్ర సీఎం జగన్... హద్దురాయి పాతి.. సర్వేను ప్రారంభించారు. సర్వేకు వినియోగించే పరికరాలను పరిశీలించిన సీఎం, డ్రోన్లను ప్రారంభించారు. ఆ తర్వాత జగ్గయ్యపేట చేరుకున్న ఆయన అక్కడి ఎస్‌జీఎస్ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సర్వే పూర్తి చేసిన తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కొందరు భూ యజమానులకు ఫీల్డు మ్యాప్, భూయాజమాన్య హక్కు పత్రం(1బీ), స్థలాలు, ఇళ్ల వంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు(ఆస్తి పత్రం) అందజేశారు. రీ సర్వే పూర్తి చేసిన తక్కెళ్లపాడు గ్రామ సచివాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ సీఎం లాంఛనంగా ప్రారంభించారు. డిజిటలైజేషన్ చేసిన రికార్డులను గ్రామ సచివాలయ సిబ్బందికి అందించారు.
పూర్తి హక్కులు కల్పిస్తాం
ప్రస్తుతం భూ యజమానులకు భూములపై ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయని.. పూర్తి హక్కులు లేవని సీఎం జగన్ అన్నారు. భూరక్ష-భూహక్కు పత్రం ద్వారా పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, స్థిరాస్తికి సంబంధించి అవకతవకలు, సహా భూ సమస్యలు పరిష్కరించి రైతులకు స్థిరాస్తులపై పూర్తి స్థాయిలో హక్కు కల్పించేందుకు రీ సర్వే చేపట్టినట్లు సీఎం తెలిపారు. రైతులు నష్టపోయిన భూమికి ప్రభుత్వం హామీగా ఉంటుందని, తగిన పరిహారం అందిస్తామన్నారు.
100 ఏళ్ల తర్వాత
భూములు కబ్జాలకు గురై కష్టాలు పడుతోన్న వారిని చూసి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం... అలాంటి వారి నుంచి భూములను యజమానులు కాపాడుకునేందుకే సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా 1927-28లో సర్వే జరిగిందని ... దాదాపు 100 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రీ సర్వేతో భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై, ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం అన్నారు.
గత పరిస్థితి ఉండొద్దు
ల్యాండ్ గ్రాబింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటే పక్కాగా రికార్డులు కావాలి. వీటన్నింటికి సమాధానంగా ఇదే తక్కెళ్లపాడు నుంచి భూముల సర్వేకు, శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులు నష్టపోయిన భూమికి ప్రభుత్వం హమీగా ఉంటుంది. ప్రస్తుతం భూముల వివరాలు కావాలంటే 4 కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గతంలో ఉన్న పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ల్యాండ్ రికార్డుల్లో ఒక మోడల్‌గా ఉండాలని చర్యలు తీసుకుంటున్నాం.
-వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి
1000 కోట్ల వ్యయంతో..
'రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కూడా కొలిచే ఈ సర్వే మూడు దశల్లో 2023 నాటికి పూర్తి అవుతుంది. సర్వేకు అయ్యే ఖర్చులో ఒక్క పైసా కూడా రైతు, భూయజమానులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ‘దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం చేపట్టగా, 4500 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే చేస్తున్నాం.' అని సీఎం జగన్ చెప్పారు.
ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నంబర్
ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ ఆస్తి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తామన్న సీఎం.. దానితో పాటు అంగుళాలతో సహా నిర్ధరించిన భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కూడా ఇస్తామన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో ఒక విలేజ్ మ్యాప్ ఉంటుందని.. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడీ నెంబర్ కూడా కేటాయిస్తారన్నారు. ఆ నంబర్‌తో సదరు భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధరణ అవుతుందన్నారు. ‘దీనిని సోషల్ ఆడిట్ కోసం అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు అదే గ్రామంలోని సచివాలయాల్లో, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై తరువాత ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే కొద్ది రోజుల తరువాత భూయజమానికి శాశ్వత టైటిల్ ఇస్తారని సీఎం వివరించారు.
ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది
భూకమతం పటంతో పాటు గ్రామంలోని భూముల పటం, రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, 1-బి రిజిస్టర్ వంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు డిజిటల్ రూపంలో నాలుగు చోట్ల ఉంటాయి. వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ ఉండదని సీఎం అన్నారు. డిజిటల్‌తో పాటు హార్డ్ కాపీ కూడా భూజయమానులకు ఇస్తామన్నారు. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల రిజిస్ట్రేషన్లు ఇక ఆయా గ్రామ సచివాలయాల్లోనే జరుగుతాయన్నారు. ‘రాష్ట్రంలో ఏ రైతు అయినా 2019లో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తరువాత ఆ భూమి మీద హక్కు లేదని తేలితే, రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తుందనే గ్యారెంటీ ఇస్తున్నామన్నారు.
జగ్గయ్యపేటకు వరాలు
జగ్గయ్యపేట నియోజకవర్గానికి సీఎం వరాలు కురిపించారు. నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చుతూ త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనం కోసం రూ.5 కోట్లు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.15 కోట్లు, ట్రామా కేర్ సెంటర్‌కు 3 కోట్లు, ఎర్రకాలువ, వేపలవాగు అభివృద్ధి కోసం రూ.5 కోట్లు మంజూరు చేశారు. జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు కోసం కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం చెప్పారు.
అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తాం
బృహత్తర కార్యక్రమంలో తమకు భాగస్వామ్యం కల్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు సర్వే ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూ సర్వే ప్రారంభిస్తున్నామని.. సర్వే కోసం ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అత్యంత పారదర్శకతతో భూములను రీ సర్వే చేస్తామని, లోపాలకు తావు లేకుండా భూముల వివరాలు డిజిటలైజేషన్ పూర్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: స్లాట్ బుకింగ్ లేకుండానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు