YS Sharmila Fires On KTR: మంత్రి కేటీఆర్‌పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మునుగోడులో తెరాసను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. తెరాస అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దత్తత తీసుకోవాలా అంటూ విమర్శించారు. మునుగోడు ప్రాంతం ఏమన్నా పక్క రాష్ట్రంలో లేదా పక్క దేశంలో ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
మునుగోడులో తన మద్దతు కావాలని కొందరు అడిగారని.. తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని తెలిపినట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ల పేరుతో ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ దానిని మూడింతలు పెంచారని విమర్శించారు. గతంలో జరిగిన ఇతర స్కామ్‌లతో పోలిస్తే కాళేశ్వరం ఇంకా పెద్ద స్కామ్ అని దుయ్యబట్టారు.
ఈ అవినీతిపై తాము తప్ప ఎవరూ నోరు మెదపడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి ప్రాజెక్టును మేగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు వాటా ఉంది కాబట్టే మేగాకే ప్రాజెక్టులు దక్కుతున్నాయని దుయ్యబట్టారు. మాకు తెలిసిన సమాచారంతో ఈడీ, సీబీఐ, కాగ్‌కు నివేదిక ఇచ్చామని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అవినీతిపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. బండి సంజయ్, రేవంత్‌కు బాధ్యత లేకుండా డబ్బు కోసం దేనికైనా అమ్ముడుపోతారా అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే ప్రశ్నించమని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
"కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. దత్తత తీసుకుంటానని చెబుతున్నారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్నారు. ఏం అభివృద్ధి చేశారు. అసలు మీరు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ఏంటి. మునుగోడు ప్రాంతం ఏమన్నా పక్కన కర్ణాటక, మహారాష్ట్ర, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉందా. మీరు అధికారంలో ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరు దత్తత తీసుకోవాలా. అది మీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట అయితే ప్రత్యేక ఫండ్ ఇస్తారా. మిగతా ప్రాంతాల ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేయలేదా. అసలు మీకు ఏమి హక్కు ఉందని మునుగోడులో అంత మంది వచ్చి ప్రచారం చేస్తున్నారు." - వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చదవండి: 'డబ్బులిస్తే ఎమ్మెల్యే షకీల్ ఏ పనైనా చేస్తారంటగా..'
తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్
మునుగోడు ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
అరుణాచల్ హెలికాప్టర్ క్రాష్‌పై విచారణ.. ఘటనకు ముందు ఏం జరిగిందంటే?