Young woman died due to dog bite: రాష్ట్రంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోంది. వాటి దాడుల్లో గాయపడే వారు, చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం కనిపించడం లేదు. తాజాగా కుక్క కాటుకు మరో ప్రాణం బలైంది. చేతికి వచ్చిన కూతురు రేబిస్ లక్షణాలతో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుక్క కాటుకు నిండు ప్రాణం బలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఓ యువతి కుక్క కాటు వల్ల మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండాలో కొట్టెం ముత్తయ్య, తన కూతురు శిరీష(17)ను నెల క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. దాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ముత్తయ్య కుక్క కాటుకు వ్యాక్సిన్ తీసుకున్నాడు. కానీ శిరీష మాత్రం టీకా తీసుకోవడానికి నిరాకరించింది. అదే తనకు ముప్పును తెచ్చి పెట్టింది. నాలుగు రోజుల నుంచి శిరీషలో రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. రేబిస్లక్షణాలు ఉన్న కారణంగా వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినా అప్పటికే చేయి దాటిపోయింది. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మంగళవారం రాత్రి శిరీష మరణించింది.
A woman hanged herself for not accepting love: మరోవైపు.. తన ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని చనిపోయింది. ఎస్సార్‌నగర్ ఎస్సై స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఓ యువతి(18) టెలీ కాలర్‌గా పని చేస్తుంది. అమీర్‌పేటలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చారు. తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంతూర్లో ఉంటున్న యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. నెల క్రితం ఊరికి వెళ్లి ఇంట్లోని తన సామగ్రిని తెచ్చుకుంది. ఇంట్లో వారెవ్వరితోనూ మాట్లాడలేదు. ఇంటి నుంచి వచ్చిన తాను ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: