ETV Bharat / state

LOCAL BODY MLC ELECTIONS 2021: ముగిసిన ఉపసంహరణ గడువు.. సగం స్థానాల్లో ఏకగ్రీవమే.. - telangana varthalu

Telangana MLC elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిని తెరాస ఖాతాలో వేసుకుంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

LOCAL BODY MLC ELECTIONS 2021: ముగిసిన ఉపసంహరణ గడువు.. సగం స్థానాల్లో ఏకగ్రీవమే..
LOCAL BODY MLC ELECTIONS 2021: ముగిసిన ఉపసంహరణ గడువు.. సగం స్థానాల్లో ఏకగ్రీవమే..
author img

By

Published : Nov 26, 2021, 3:41 PM IST

Updated : Nov 26, 2021, 7:54 PM IST

ముగిసిన ఉపసంహరణ గడువు.. సగం స్థానాల్లో ఏకగ్రీవమే..

LOCAL BODY MLC ELECTIONS 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc Elections) నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరు ఏకగ్రీవమై తెరాస ఖాతాలో పడ్డాయి. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్‌(polling) జరగనుంది. డిసెంబర్‌ 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

పోచంపల్లి ఏకగ్రీవం

mlc elections: వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయింది. వరంగల్​ జిల్లాలో ఒక స్థానానికి మొత్తం 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో 13 మంది స్వతంత్రులే ఉన్నారు. స్వతంత్రుల్లో పది మంది నామపత్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అధికారులు తిరస్కరించగా... ముగ్గురు స్వతంత్రులూ తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఏకైక అభ్యర్ధిగా పోచంపల్లి నిలవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కావడంతో గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ధ్రువీకరణ పత్రం అందుకున్న పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి
ధ్రువీకరణ పత్రం అందుకున్న పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి

నిజామాబాద్​ నుంచి కవిత ఏకగ్రీవం

MLC elections 2021: బుధవారం నిజామాబాద్‌ స్థానం నుంచి కవిత నామినేషన్‌ ఒక్కటే మిగలగా.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పని చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి ధ్రువీకరణ పత్రం అందించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. మరోసారి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కవిత కృతజ్ఞతలు తెలిపారు.

ధ్రువీకరణ పత్రం అందుకున్న కవిత
ధ్రువీకరణ పత్రం అందుకున్న కవిత

రంగారెడ్డి జిల్లాలో రెండూ తెరాస ఖాతాలోకే..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులను స్థానిక సంస్థల కోటాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లోని కోర్టు హాల్​లో గెలిచిన అభ్యర్థులకు జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​లకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కావల్సిన నిధులను ప్రభుత్వంతో చర్చించి మంజూరు చేసేందుకు కృషి చేయనున్నట్లు ఇరువురు వెల్లడించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్​ రాజు, పట్నం మహేందర్​ రెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్​ రాజు, పట్నం మహేందర్​ రెడ్డి

పాలమూరులో రెండు ఏకగ్రీవమే..

TRS Won Mahabubnagar MLC Seats: మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒకే ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లాంఛనం అయింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి బరిలో దిగిన తెరాస అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు ఇ. శ్రీధర్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన వారికి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ శుభాకాంక్షలు తెలిపారు. తమకు రెండోసారి శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించి తమ గెలుపునకు సహకరించిన ముఖ్యమంత్రికి, మంత్రి కేటీఆర్​కు, జిల్లా మంత్రులకు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్​ రెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్​ రెడ్డి
ధ్రువీకరణ పత్రం అందుకున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి
ధ్రువీకరణ పత్రం అందుకున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఐదు జిల్లాల్లో..

మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్​ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అక్కడ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. నల్గొండ, మెదక్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. నల్గొండలో తెరాస అభ్యర్థితో పాటు స్వతంత్రులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో తెరాస సహా కాంగ్రెస్ అభ్యర్థులు, స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Mlc Elections) ఉపసంహరణలు నమోదు కాలేదు. ఖమ్మంలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస నుంచి తాతా మధు, కాంగ్రెస్​ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి బరిలో నిలిచారు.

కరీంనగర్​లో చివరి వరకు ఉత్కంఠ

కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది.చివరి రోజు ఏకంగా 14మందితో అధికార పార్టీ నాయకులు నామపత్రాలను ఉపసంహరింప చేయగా బరిలో 10మంది మిగిలారు.. మరోవైపు తెరాసకు రాజీనామా చేసిన రవీందర్​ సింగ్‌ మాత్రం బరిలో ఉన్నారు.. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన తర్వాత మొత్తం 24 మంది బరిలో మిగిలారు. మిగతా జిల్లాల్లో అధికశాతం స్థానాలు ఏకగ్రీవం చేయడంలో సఫలమైన అధికార పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం విజయం సాధించలేక పోయారు. మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలను కొనసాగించారు.అందులో భాగంగా ఏకంగా 14 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అధికార పార్టీ నుంచి ఎల్.రమణ, టి. భానుప్రసాద్‌లు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ల ఉపసంహరణలో ఉత్కంఠ

ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణలో ఉత్కంఠ కొనసాగుతోంది. 24 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా... 22 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. తెరాస నుంచి దండె విఠల్‌ , స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి మిగిలారు. తుడుందెబ్బ మద్దతుతో నామినేషన్‌ వేసిన పుష్పరాణి... నామినేషన్‌ ఉపసంహరించుకుందని అధికారులకు చెప్పిన సంపత్‌ అనే వ్యక్తి అధికారులకు తెలిపాడు. కలెక్టరేట్‌కు చేరుకున్న పుష్పరాణి తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బరిలో నిలిచినట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగాయి. పుష్పరాణి పుష్పరాణికి భాజపా మద్దతు ప్రకటించగా ఇరుపార్టీల నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. ఎట్టకేలకు తెరాస నుంచి దండె విఠల్‌ , స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి బరిలో నిలిచారు.

ఇదీ చదవండి:

MLC Jeevan Reddy on paddy: రైతుల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా?: జీవన్‌రెడ్డి

Last Updated : Nov 26, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.