BANDI SANJAY: ఆదివాసీ ముద్దుబిడ్డ ద్రౌపది ముర్మును ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాకే దక్కిందన్నారు. భాజపాతోనే దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. బాణాసంచా కాల్చి, గిరిజన నృత్యాలు చేశారు. అనంతరం బండి సంజయ్‌ని వారు ఘనంగా సన్మానించారు.
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు నరేంద్రమోదీ, నడ్డా, అమిత్ షాకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా .. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజ్యాంగ నిర్మాత సైతం సంతోషిస్తారని చెప్పారు. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
"దేశంలో మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాదే. దళిత వర్గానికి చెందిన రామ్‌నాధ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును దేశానికి రాష్ట్రపతి చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆదివాసీ ముద్దుబిడ్డ ద్రౌపది ముర్మును ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎవ్వరూ ఊహించలేదు. అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా .. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజ్యాంగ నిర్మాత సైతం సంతోషిస్తారు." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: చంచల్‌గూడ జైలుకు రేవంత్.. విద్యార్థులతో ములాఖత్