చాలాకాలంగా వాయిదా పడుతోన్న టీపీసీసీ సారథి నియామకానికి ఎట్టకేలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి వారి అభిప్రాయం సేకరించిన తర్వాతే సారథి నియామకం ఉంటుందని సమాచారం. 2018 శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను అధిష్ఠానం ఆమోదించలేదు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఆర్.సి.కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించడంతో కాంగ్రెస్‌లో కొత్త వాతావరణం నెలకొంది. కానీ ఆయన నియామకం అనంతరం జరిగిన దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో పీసీసీ కొత్త సారథితో పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
కీలక నిర్ణయాలు తీసుకోనున్న అధిష్ఠానం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తోందని త్వరలోనే పలు కీలక నిర్ణయాలు ఉంటాయని ఏఐసీసీ కీలక బాధ్యులు స్పష్టం చేశారు. ‘‘పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఇతర పదవుల భర్తీ, జిల్లా, పీసీసీ కార్యవర్గాల పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలపై అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పీసీసీ అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణలతో పాటు.. నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్ర నేతలు సమష్టిగా ముందుకెళ్లడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుంది. పదవుల్లో సమతూకం పాటిస్తాం. పార్టీ అనుబంధ విభాగాలనూ బలోపేతం చేస్తాం. మాణికం ఠాగూర్ హైదరాబాద్‌కు వచ్చి రెండు రోజుల పాటు పీసీసీ ముఖ్యులు, సీనియర్ నేతలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ విభాగాలతో చర్చించి నేతల అభిప్రాయాలను మాకు తెలియజేయనున్నారు’’ అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
రేసులో పలువురు నేతలు
పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి ప్రధానంగా పీసీసీ పీఠం రేసులో ఉన్నారు. తనకు ఈ పదవి ఇవ్వాలని ఇప్పటికే కోమటిరెడ్డి ఏఐసీసీ నేతలను కోరారు. ఈ సారి పదవి తనకు ఖాయమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సన్నిహితంగా ఉన్నారు. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు, పీసీసీలోని వివిధ విభాగాల ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌బాబు, భట్టి సహా మరికొందరి పేర్లు పార్టీలో చర్చకు వస్తున్నాయి. 2023 ఎన్నికల్లో తెరాస, భాజపాలను ఎదుర్కొనేలా పార్టీని సన్నద్ధం చేయగలిగే వారికే పీఠం అప్పగించాలని కొందరు ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జికి నివేదించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న వ్యక్తినే ఎంపిక చేయాలని పలువురు నేతలు పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పీసీసీ సారథి ఎంపిక అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఇదీ చూడండి : ఇవాళ యాసంగి రైతుబంధు విడుదలపై కేసీఆర్ సమీక్ష