రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే... మరికొన్ని చోట్ల వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 39.4, రామగుండంలో 36.4, హైదరాబాద్‌లో 35.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో ఎండల తీవ్రత తొలిసారిగా 40 డిగ్రీలకు చేరువైంది. ఇక ఇలాగే క్రమంగా పెరుగుతుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
తెలంగాణ నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు 1,500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. కర్ణాటకపై ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఆదివారం తెలంగాణలో 12 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాచలంలో 32, దుమ్ముగూడెంలో 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున రామగుండంలో 23.4, హైదరాబాద్‌లో 22.4 డిగ్రీలఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.