Rashtriya Bal Puraskar winner virat chandra : అతి చిన్న వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు సికింద్రాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం-2022కు ఎంపిక చేసింది. క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా 29 మంది ఈ అవార్డుకు ఎంపికకాగా తెలంగాణ నుంచి విరాట్ ఒక్కడే ఉన్నాడు.
పీఎం మోదీ అభినందన
మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్ర... గతేడాది మార్చి 6న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు ఆరు రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు. విరాట్ సాధించిన ఘనతకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
రోజూ సాధన
తనకు రాష్ట్రీయ బాల పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని చిన్నారి విరాట్ చంద్ర అంటున్నాడు. పర్వతారోహణ కోసం రోజూ కష్టపడేవాడినని చెబుతున్నాడు. కీసర, మౌలాలి గుట్టలను ఎక్కి ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు.
మా అమ్మనాన్న సపోర్ట్ వల్ల నేను కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాను. నేను రోజూ కష్టపడేవాడిని. రోజూ 6 నుంచి 7 కిలోమీటర్ల రన్ చేసేవాడిని. కీసర, మౌలాలి గుట్టలను ఎక్కి ప్రాక్టీస్ చేశాను.
-విరాట్ చంద్ర, రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత
మురిసిపోతున్న తల్లిదండ్రులు
విరాట్ చంద్ర పర్వతారోహణ చేస్తానన్న వెంటనే తాము కూడా ప్రోత్సహించి అన్నివిధాలా సహకరించినట్లు విరాట్ చంద్ర తండ్రి శరత్ చంద్ర తెలిపారు. ప్రత్యేకంగా కోచ్‌ను నియమించి అన్ని విధాలుగా తర్ఫీదు పొందిన తర్వాతే కిలిమంజారో పర్వతారోహణకు వెళ్లినట్లు చెప్పారు.
విరాట్ పర్వతాహోరణ చేస్తాననగానే ఓకే అన్నాం. ఒక ప్రొఫెషనల్ కోచ్‌ను అప్రోచ్ అయ్యాం. ఆయన సూచనలతోనే ప్రాక్టీస్ చేయించాం. ఆయన చెప్పినట్లుగానే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో వివిధ ఖండాల్లో ఉన్న పర్వతాలను విరాట్ అధిరోహించాలని కోరుకుంటున్నాం.
-శరత్ చంద్ర, విరాట్ చంద్ర తండ్రి
'గర్వంగా ఉంది'
ప్రధాని మోదీ పురస్కారం అందించడం గర్వంగా ఉందని విరాట్ చంద్ర కుటుంబసభ్యులు అంటున్నారు. విరాట్ మరిన్ని గొప్ప విజయాలు సాధించడానికి ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం.. 31 నుంచి ప్రత్యక్ష తరగతులు?