ఎప్పుడో నిండిపోయాయి..
హైదరాబాద్ పరిధిలో దాదాపు మూడు వేల వరకు చిన్నా పెద్దా ఆస్పత్రుల్లో సుమారు పదివేల పడకల్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు వేలల్లో ఉన్నా.. ఇప్పుడు వీటిలో ఒక్కటంటే ఒక్క పడక ఖాళీగా లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు లేకపోవడంతో చాలామంది నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గాంధీలో మొత్తం 650 వెంటిలేటర్, మరో 650 వరకు ఆక్సిజన్ బెడ్లున్నాయి. సోమవారం రాత్రి నాటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆక్సిజన్ స్థాయి మెరుగుపడిన రోగులను ఆక్సిజన్ పడకల్లోకి మార్ఛి. ఖాళీ అయిన పడకలను కొత్త రోగికి కేటాయిస్తున్నారు.
తమ వంతు కోసం..
గాంధీలో నిత్యం దాదాపు 80 మంది వరకు విషమ పరిస్థితిలో ఉన్న రోగులు వెంటిలేటర్ పడకల కోసం దాదాపు ఆరేడు గంటలు అంబులెన్సులోనే ఉండాల్సి వస్తోంది. కార్లలోనూ ఇతర వాహనాల్లోనూ మరో 300 మంది రోగులు వస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల వద్ద పడకల్లేక ఆరుబయటే తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గచ్చిబౌలిలోని టిమ్స్‌లో అనేక పడకలు ఖాళీగా ఉండేవి. మొత్తం వెయ్యి పడకలుండగా ఇందులో 800 పడకలను కొవిడ్ రోగుల కోసం సిద్ధం చేశారు. వీటిలో 136 వెంటిలేటర్, 500 వరకు ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం సనత్‌నగర్‌కు చెందిన రోగి ఒకరు ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి టిమ్స్‌కు వెళితే వెంటిలేటర్ పడక ఖాళీ లేదంటూ అయిదు గంటలు బయటే కూర్చోబెట్టారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఒక పడకను ఖాళీ చేసి సంబంధిత రోగిని చేర్చుకున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రి, ఛాతి ఆస్పత్రుల్లో వారం కిందటే పడకలన్నీ నిండిపోయాయి. నిత్యం రాజధానితోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి.. మొత్తం రెండువేలకుపైగా రోగులు చికిత్స కోసం నగరానికి వస్తున్నారు. వీరిలో చాలా మందికి పడకలు దొరకడం లేదు.
నత్తనడకన పడకల పెంపు..
గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి తదితర ఆస్పత్రుల్లో మరో 600 నుంచి 700 వరకు పడకలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పడకల పెంపు పనులు ఇంకా మొదలుకాలేదు. కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో మూడొంతులు వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లుగా మారిస్తే మరికొంతమంది రోగులకు చికిత్స అందించడానికి వీలుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
‘పడకల్లేవ్.. సహకరించండి’
కింగ్‌కోఠి ఆసుపత్రిలో గోడపత్రిక ఏర్పాటు
‘కొవిడ్-19’ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బాధితులు అత్యవసర వైద్యం కోసం ఏ ఆసుపత్రి గడప తొక్కినా పడకల్లేవ్ అనే సమాధానం వస్తోంది. వైద్య విధాన పరిషత్(కింగ్‌కోఠి) జిల్లా ఆసుపత్రిలో కూడా అదే పరిస్థితి. దాంతో ఆసుపత్రి వైద్యాధికారులు ట్రయేజ్(ఓపీ) బ్లాక్‌లో ‘నో బెడ్స్ ఆర్ అవైలబుల్’, ‘నో అడ్మిషన్స్’, ‘దయచేసి సహకరించండి’ అనే గోడపత్రికను ఏర్పాటు చేశారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో నిమిషాల్లో పడకలు నిండిపోతున్నాయి. సోమవారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఓ కొవిడ్ బాధితుడిని కింగ్‌కోఠి ఆసుపత్రికి పంపించారు. కానీ, పడకలు లేవన్నారు. బాధితుడి భార్య వైద్యులను బతిమాలింది. ఏదైనా పడక ఖాళీ అయితే ఇస్తాం వేచి ఉండండి అని చెప్పారు. మూడు, నాలుగు గంటల పాటు ఎదురు చూశారు. చివరకు ఓపీలో వైద్యురాలిని కలిసి మందులు రాయించుకొని వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు