ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ప్రసాదరావు.. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన వంగపండు.. పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు.. 'అర్ధరాత్రి స్వాతంత్ర్యం' సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. 'ఏం పిల్లడో ఎల్దమొస్తవ' పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో జననాట్యమండలిని స్థాపించారు. విప్లవ కవి వంగపండు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.