ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆంగ్లంపై పట్టుసాధించాలనే ఉద్దేశంతో యూఎస్ కాన్సులేట్ ఇంగ్లీష్ యాక్సెస్ మైక్రో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ చేపట్టింది. ప్రపంచంలోని 80 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తోంది. మన హైదరాబాద్‌లోనూ రెండు ప్రభుత్వ పాఠశాలలు ఎంచుకుంది. షేక్‌పేట్ ప్రభుత్వ పాఠశాల, టపాచబుత్రలోని అహద్ హైస్కూల్‌ను ఎంపిక చేసుకుంది.
రెండు సంవత్సరాల శిక్షణ
ఈ పాఠశాలలోని విద్యార్థులకు ముందుగా పరీక్ష నిర్వహించారు. మార్కుల ఆధారంగా ఒక్కో పాఠశాల నుంచి 25 మందిని ఎంపిక చేశారు. మొత్తం 50 మందికి రెండేళ్ల పాటు ఇంగ్లీష్‌పై తరగతులు నిర్వహించారు. ఇందుకయ్యే ఖర్చంతా అమెరికా ప్రభుత్వమే భరించింది. ఈ సొమ్మును నేరుగా పాఠశాలలకు కాకుండా ఎల్‌ఎల్‌ఎఫ్ అనే సంస్థకు అప్పగించింది. రెండేళ్ల పాటు పాఠశాల సమయం అనంతరం రెండు నుంచి మూడు గంటల పాటు తరగతులు నిర్వహించి విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా శిక్షకులు అన్నపూర్ణ, శ్వేత తీర్చిదిద్దారు.
భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలలు
విద్యార్థులకు ఇంగ్లీష్ భాషతో పాటు భారత్, అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణం చట్టాలపైన అవగాహాన కల్పించారు. ఇంగ్లీష్‌పై బెరకు ఉన్న తమను అనర్గళంగా మాట్లాడేలా తమ శిక్షకులు తీర్చిదిద్దారని విద్యార్థులు చెబుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను యుఎస్ కాన్సులేట్ జనరల్ జోయోల్ రీఫ్మెన్ పంపిణీ చేశారు. భవిష్యత్‌లోనూ మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుని శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
ఆంగ్లంపై పట్టులేని తమకు ఇంగ్లీష్ ఆక్సెస్ మైక్రో స్కాలర్‌షిప్ ప్రోగ్రాం పూర్తి ప్రావీణ్యాన్ని కల్గించిందని... రెండేళ్ల పాటు శిక్షణ పొంది యాక్సెస్‌ను వదిలి వెళ్లాలంటే కష్టంగా ఉందని విద్యార్థులు అన్నారు.
ఇదీ చూడండి: నిధులు దండిగా... వ్యవసాయం ఇక పండగ!