kishan reddy fires on cm kcr కోర్టులు మొట్టికాయలు పెట్టినా చీమ కుట్టినట్లైనా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గారడీ మాటలతో మసిపూసి మారేడుకాయ చేయడం కేసీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కథ, స్కీన్‌ప్లేతో ప్రజలకు 'ఫైల్స్' సినిమా చూపించారని ఆరోపించారు. కేసీఆర్ తప్పుడు కేసులతో రాద్దాంతం చేశారని వెల్లడించారు. కేసీఆర్ సర్కారు తీరుపై హైకోర్టు మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు.
''ఫామ్‌హౌస్ ఫైల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. బీజేపీని భయపెట్టించే విధంగా అనేక కుట్రలు చేసింది. కేసీఅర్ తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఇతరులపై కుట్రలు పన్నడం ఆయకు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. కేసీఆర్ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఎదుగుతుంటే దెబ్బతీస్తున్నారు. కేసీఆర్ దర్శకత్వంలో రూపొందించిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాలో పస లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మొట్టికాయలు వేసింది. నోటీసుల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. సిట్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.'' - కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఎలాంటి ఆధారాల్లేని కేసులో సిట్ వేశారని కేంద్రమంత్రి కిషన్ ఆరోపించారు. తప్పుడు కేసును సీరియల్ లాగా సాగదీశారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వీడియోలు సీఎంకు ఎలా చేరాయని ప్రశ్నించారు. ఓ వైపు కేసు విచారణ జరుగుతున్నప్పుడే దుష్ప్రచారం ప్రారంభించారని వివరించారు.
''కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియోలు ప్రసార మాధ్యమాలకు పంపించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్‌లు రికవరీ చేయలేదు. ఎమ్మెల్యేల ఫోన్‌లు ఎందుకు రికవరీ చేయలేదో కేసీఆర్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యేలను వారాల పాటు ప్రగతి భవన్‌లో ఎందుకు బంధించారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. కోర్టు తీర్పు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది.'' - కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఇవీ చదవండి: