Unhygienic Kitchen in Gandhi : ఆస్పత్రులంటే రోగులకు వరప్రదాయినులు. భగవంతుడి తర్వాత ఏ వ్యక్తి అయినా చేతులెత్తి దండం పెట్టేది వైద్యులకే. అందుకే దేవాలయాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. మరి అదే ఆస్పత్రుల విషయానికొస్తే.. దీనికి సమాధానం నిశ్శబ్దమే. పరిశుభ్ర వాతావారణం మధ్య స్వచ్ఛమైన గాలి, ఆహారం, చికిత్సను అందిస్తూ రోగులకు భరోసా కల్పించాల్సిన పెద్దాస్పత్రులు.. అవేమీ పట్టనట్లుగా ఉంటున్నాయి. ప్రాణాలు నిలుపుకొందామని వచ్చిన రోగులకు.. అక్కడి పరిస్థితి చూస్తేనే ఊపిరి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనికి తాజా దృష్టాంతమే.. గాంధీ ఆస్పత్రిలోని వంటగది. మీరొక్కసారి ఆ వంటగది చూశారంటే.. ఇక కళ్లు, ముక్కు మూసుకోవాల్సిందే.
అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే.. ఇంట్లో ఒకరిద్దరికి వంటచేస్తేనే.. ఆ వెంటనే వంటగదిని శుభ్రం చేసుకుంటాం. అదే రోజూ వందలమందికి వండి వార్చాలంటే ఇంకెంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాస్త జిడ్డు వాసన వచ్చినా బొద్దింకలు, బల్లులు వంటగదిలో రాజ్యమేలుతాయి. ఇక భారీ వంటగదుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. సందు దొరికితే చాలు ఎలుకలు, పందికొక్కులు కలుగుల్లోంచి కిచెన్లోకి దూరతాయి. కూరగాయలు, బియ్యం, పప్పులు వేటిపైన అయినా అవి పారినా.. ఇక అనారోగ్యాన్ని.. తిని తెచ్చుకున్నట్లే. నిత్యం వేల మంది రోగులతో కిటకిటలాడే గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే దర్శనమిస్తోంది.
అపరిశుభ్రం తాండవం: గాంధీలో రోగులకూ, రోగి బంధువులకూ వండివార్చడానికి ఉన్న ఆ వంటగదిని చూస్తే మాత్రం.. అక్కడి నుంచి వచ్చే ఏ వంటకమైనా ఇక ముట్టరేమో. ఇక్కడి వంట గదిలో బండలు ఎక్కడికక్కడ పగిలిపోయాయి. అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. వేటిపైనా మూతలు లేవు. ఎక్కడి జిడ్డు అక్కడే పేరుకుపోయి ఉంది. దీంతో ఎలుకలు, పందికొక్కులకు దారి తెరిచినట్లుగా ఉంది. ఇప్పటికే వరంగల్ ఎంజీఎంలో ఎలుకల బీభత్సానికి రోగి మరణించిన ఘటన కలవరపెడుతుంటే.. ఆస్పత్రులో పారిశుద్ధ్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడటం భయాందోళనలకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని పెద్దాస్పత్రుల్లో ఎలుకలు, పిల్లులు, పాములు సంచరిస్తుండటంతో రోగులు, వారి బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. అయినా.. అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదు.
ఇదీ చదవండి: Good Health: మన ఆరోగ్యం మన బాధ్యత.. అందుకే ఈ మార్పులు తప్పనిసరి.!