Family planning Operation failed: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు మృతిచెందిన ఘటన ఆందోళనలకు దారితీసింది. ఈ నెల 25న ఒకే రోజు 27మంది మహిళలకు ఆపరేషన్లు జరగ్గా... వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్యలు... ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు.
వైద్యపరీక్షల అనంతరం అందరితో పాటు ఇంటికి వెళ్లగా... ముగ్గురు మాత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మమతను బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... సుష్మను ఇబ్రహీంపట్నంలో మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీతారాంపేట్‌కు చెందిన లావణ్యను హైదరాబాద్‌లోని ఓవైసీ ఆస్పత్రిలో చేర్పించారు. బీఎన్ రెడ్డిలో చికిత్స పొందుతున్న మమత పరిస్థితి విషమించి... ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుష్మ.... ఇబ్రహీంపట్నంలో తెల్లవారుజామున మృతిచెందింది. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు మృతిచెందటం.... మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళలు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. సుష్మ మృతదేహాన్ని సాగర్ రహదారిపై ఉంచి... అక్కడే బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహిళల మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పార్టీ నేతల డిమాండ్ చేశారు.
మహిళల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని కుటుంబ సంక్షేమశాఖ ఉపసంచాలకులు రవీందర్‌నాయక్ వెల్లడించారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన... ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వచ్చి... పరిస్థితిపై ఆరా తీశారు. అనుభవజ్ఞులైన వైద్యులే కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తారని... విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. చనిపోయిన ఇద్దరి మహిళల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రంగారెడ్డి ఆర్డీవో వెంకటాచారి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడిన ఆయన... రెండు కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. వారికి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని, మృతుల పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: