హైదరాబాద్‌కు మ్యుకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బాధితుల తాకిడి పెరుగుతోంది. కోఠిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని చెవి, ముక్కు, గొంతు వ్యాధుల ఆసుపత్రిని బ్లాక్‌ఫంగస్ నోడల్ కేంద్రంగా మార్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది చికిత్స పొందున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో శస్త్రచికిత్స చేశారు. అందరూ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారే.
కొందరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అరుదుగా వచ్చే ఈ వ్యాధికి యాంటీ ఫంగల్ మందులు వాడతారు. గతంలో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి ఆరు నెలలకు ఒక కేసు వచ్చేది. కొవిడ్ తర్వాత ఈ కేసులు అనూహ్యంగా పెరిగాయి. మందుల కొరత వల్ల బయట నుంచి ఇంజక్షన్లు తెచ్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాళ్లు అరిగేలా మందుల దుకాణాల వెంట తిరుగుతున్నా.. ఎక్కడా దొరకడం లేదు.
అవసరమైతే పడకలు పెంచుతాం
అవసరమైతే 200 పడకలు కేటాయించే అవకాశం ఉంది. ముక్కు ఒకవైపు మూసుకుపోవడం, కన్ను, ముఖం నొప్పి, ముక్కు చుట్టూ నల్ల మచ్చలు, తలనొప్పి, జ్వరం, ముక్కు నుంచి రక్తం లేదంటే నల్లని బూడిద రంగులోని ద్రవం రావడం వంటివి గుర్తిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి.-డాక్టర్ శంకర్, ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్
బ్లాక్ ఫంగస్ చికిత్స ఏర్పాట్లు, ఔషధాలపై వివరాలు ఇవ్వాలి: హైకోర్టు