TSRTC Rent Bus Owners Meet With Minister Ponnam : తమ సమస్యలు తీర్చాలంటూ అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను (Minister Ponnam) కలిశారు. వారి సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. చాలా కాలంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నారని పొన్నంకు అద్దె బస్సుల యజమానులు వివరించారు. వారి ఆవేదనను విన్న పొన్నం సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
TSRTC Bus Owners Meet With Sajjanar : అనంతరం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను (Sajjanar) అద్దె బస్సుల యజమానులు కలిసి తమ సమస్యలు వివరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి బస్సులకు సరైన మైలేజ్రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం గంటకు తిరగాల్సింది కూడా తిరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పీవీజీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.4.50లు, సిటీ బస్సులకు రూ.4గా మార్పులు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సుల ఇన్సూరెన్స్ కెపాసిటీ పల్లె వెలుగు బస్సులకు 56మంది, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 51గా ఉంది.
మా బస్సు బిల్లులు చెల్లించండి: అద్దె బస్సుల యజమానులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు. ఈ పథకం ప్రారంభించినప్పుటి నుంచి ఆర్టీసీ ప్రయాణాలు పెరిగాయని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో 100 నుంచి 120 మంది బస్సులో ప్రయాణించడం వల్ల ఓవర్ లోడ్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని దాన్ని యాజమాన్యమే చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓవర్‌లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని వివరించారు. ప్లోర్ రేట్ కిలోమీటర్‌కు రూ.3 అదనంగా పెంచాలని కోరారు. అద్దె బస్సుల డ్రైవర్లపై పని ఒత్తిడి పెరిగిపోయిందని ఆ దిశగా ఆలోచన చేయాలని ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ను కోరారు.
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన.. వేతనాలు పెంచాలని డిమాండ్
RTC MD Sajjanar on Rent Bus Owners Problems : సమావేశం అనంతరం సజ్జనార్ మాట్లాడారు. అద్దె బస్సుల యజమానుల సమావేశం తమ దృష్టికి వచ్చిందని, వారం రోజుల్లో వారి సమస్యలపై కమిటి వేసి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయన్నారు. సంక్రాంతికి ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని సజ్జనార్ స్పష్టం చేశారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తామని దానికి సంబంధించిన వివరాలను రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. ఈనెల 10వతేదీ లోపే సమస్యలను పరిష్కరిస్తామని అద్దె యజమానులకు హామీ ఇచ్చారన్నారు. దీంతో యాజమాన్యం హామీ ఇవ్వడంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు బస్సుల యజమానులు తెలిపారు.
అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్