TSRTC Reduced Advance Reservation Charges : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు.. ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు వరకు రూ.20.. 350 కిలోమీటర్లు, ఆపై కిలో మీటర్లకు రూ.30 తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
TSRTC Latest News : ఈ క్రమంలోనే సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే.. టీఎస్‌ఆర్టీసీ రూ.30 వసూలు చేయనుంది. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన వస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రతి రోజు సగటున 15,000 వరకు.. తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారని యాజమాన్యం తెలిపింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకే.. వీటిని తగ్గించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్‌లు కోరారు.
TSRTC New Initiative To Provide Snacks In Bus : ఇటీవలే టీఎస్ఆర్టీసీ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు.. బస్‌టికెట్‌తో పాటే స్నాక్‌బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రయాణికుల కోసం బస్సు మధ్యలో ఎక్కువ సార్లు అపే అవసరం ఉండదని అధికారులు తెలిపారు. తొలుత హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో ప్రవేశపెట్టింది.
స్పందనను బట్టి విస్తరణ: ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా.. మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చిక్కి ప్యాకెట్లతో పాటు, చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, మౌత్ ఫ్రెషనర్, టిష్యూ పేపర్ స్నాక్‌బాక్స్‌లో ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను వసూలు చేస్తున్నారు. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తుంది.
వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్న టీఎస్ఆర్టీసీ : ప్రతి స్నాక్‌బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని.. దానిని ఫోన్లలో స్కాన్ చేసి సంస్థకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు ఇచ్చే రెస్పాన్స్‌ను పరిగణలోకి తీసుకుని.. స్నాక్ బాక్స్‌లో పదార్థాల మార్పులు, చేర్పులు చేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికుల సలహాలను బట్టి మిగతా సర్వీసులకు స్నాక్‌బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-9 టికెట్ అందుబాటులోకి తెచ్చింది.
ఇవీ చదవండి: TSRTC Launched E-Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 'ఈ-గరుడ' సేవలు అందుబాటులోకి వచ్చేశాయ్..
TSRTC: ఊరూరా.. వాడవాడనా బస్ ఆఫీసర్లు.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం