TSRTC Governing Board: తెలంగాణ ఆర్టీసీ వార్షిక లాభనష్టాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2014 తర్వాత తొలిసారి శనివారం జరగబోయే ఆర్టీసీ పాలకవర్గ(బోర్డు) సమావేశంలో వీటిని ఆమోదించనున్నారు. సుదీర్ఘ కాలంపాటు సమావేశం జరగకపోవటంతో తాజా సమావేశ ఎజెండాను సుమారు 300 అంశాలతో సిద్ధంచేశారు. సాధారణంగా ఏటా ఆర్థిక సంవత్సర లెక్కల మదింపు తరవాత పాలకవర్గం సమావేశమై వాటిని ఆమోదించటం ఆనవాయితీ. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో ఒక్కసారి మాత్రమే పాలకవర్గ సమావేశం జరిగింది.
తర్వాత అధిక కాలంపాటు అధికారులతోనే కార్యకలాపాలను నిర్వహించారు. ఆరేడు నెలల కిందట సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ తరవాత నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు పాలకవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
రుణాలు పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులతో..
వార్షిక లాభనష్టాలను పాలకవర్గ ఆమోద ముద్ర పడకపోవడతంతో కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అప్పులు దొరక్క ఆర్టీసీ నానా అవస్థలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించటం ఒక్కటే మార్గమని అధికారులు గుర్తించారు. పాలకవర్గ ఆమోదం లేకుండానే కొన్నేళ్లుగా పదోన్నతులు ఇస్తూ వస్తున్నారు. వీటికి పాలకవర్గ ఆమోదం లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ అంశాన్నీ ఎజెండాలో చేర్చారు.
పాలకవర్గంలో ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక, రవాణా, కార్మిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రతినిధి, రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు. కార్మిక వర్గాల నుంచి ఒకరు సభ్యుడిగా ఉంటారు. కానీ ఆ పోస్టు ఖాళీగా ఉంది. డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యం, సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ పాలకవర్గ సమావేశంలో ఛార్జీల పెంపుదల అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుందని సమాచారం.
ఇవీ చదవండి: