TSRTC Brings new Buspass System : తెలంగాణలో నెల వారీ బస్ పాస్‌లు ఉపయోగించే వారికి టీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఎక్స్ ప్రెస్ సర్వీసుల బస్ పాసుల మంజూరులో ప్రస్తుతం ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తి వేసి, కిలోమీటర్ ఆధారంగా ఈ బస్ పాసులు మంజూరు చేయాలని నిర్ణయించింది. టోల్ ప్లాజా రుసుం కూడా వాటితో పాటే వసూలు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మన రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల మంది వరకు ఈ నెల వారీ బస్ పాస్‌లను ఉపయోగిస్తారు. 'మంత్లీ సీజన్ టికెట్' పేరుతో పాస్‌లను ఇస్తారు. డైలీ 100 కిలో మీటర్ల లోపు ప్రయాణించే వారికి ఇది మంజూరు చేస్తారు. నిత్యం తిరిగే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు వారి వృత్తి రీత్యా వీటిని అధికంగా తీసుకుంటారు. ఈ పాస్ తీసుకుంటే సాధారణ టికెట్ ధరతో పోలిస్తే.. 33 శాతం రాయితీని సంస్థ అందిస్తోంది. 20 రోజుల ఛార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
దీంతో పాటు బస్‌పాస్ దారులు.. నిర్ణయించిన బస్సుల్లోనే కాకుండా.. కొంత శాతం రుసుం చెల్లించి వేరే బస్సుల్లోనూ ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. ఉదాహరణకు పల్లెవెలుగు సీజన్ టికెట్ హోల్డర్.. తాను ప్రయాణించడానికి తీసుకున్న రూట్లో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించడానికి రూ.10ని అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. అదే ఎక్స్ ప్రెస్ సీజన్ టికెట్ హోల్డర్ డీలక్స్ బస్సుల్లో వెళ్లాలంటే రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నెలవారీ బస్‌పాస్‌ల్లో గతంలో శ్లాబ్ విధానం అమల్లో ఉండేది. ఇక మీదట 51 కిలో మీటర్లకే బస్‌పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. టోల్‌ప్లాజా రుసుం కూడా బస్ పాస్‌లోనే ఉండనుంది. " ఈ నిర్ణయం నెలవారీ బస్‌దారులకు ఎంతో మేలు చేస్తుంది." అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సదుపాయాన్ని రెగ్యులర్ ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన టోల్ గేట్ల రుసుంను భరించడాన్ని ఆర్టీసీ.. ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని నిర్ణయించుకుంది. మినీ బస్సుల నుంచి మొదలుకుని గరుడ ప్లస్ వరకు ఆయా బస్సుల్లో ప్రయాణించే వారిపై ఇకనుంచి అదనంగా రూ.4 వసూలు చేయనుంది. ఇక నాన్ ఏసీ స్లీపర్ బస్సుల ప్రయాణికులకు రూ.15, ఏసీ స్లీపర్ బస్సుల వారికి రూ.20 చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక వర్గం ప్రజలకు మేలు చేకూరనుంది.
ఇవీ చదవండి: