హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111పై సెప్టెంబరు నెలాఖరు వరకు తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జీవో 111, కోకాపేట భూముల వేలానికి సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. జీవో 111 పరిశీలన కోసం 2016 డిసెంబరులో సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. నాలుగేళ్లు దాటినా కమిటీ నివేదిక సమర్పిచక పోవడం వెనక రహస్య అజెండా ఏమిటని సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నివేదిక సమర్పించేందుకు కమిటీకి తుది గడువు ఎందుకు విధించలేదని.. మరో శతాబ్దం పడుతుందా అని అసహనం వ్యక్తం చేసింది.
కరోనా పరిస్థితులు, తదితర కారణాల వల్ల కొంత ఆలస్యమైందని.. 8 వారాల గడువు ఇస్తే నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అదనపు ఏజీ రామచంద్రరావు కోరారు. ఇప్పటికే నాలుగేళ్లు దాటినందున.. మరో రెండు నెలల గడువు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సెప్టెంబరు 13 నాటికి ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండో ఐపీటీఆర్ఐ నివేదికలోని అంశాలపై కూడా కమిటీ అభిప్రాయాలను తెలపాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడవులోగా నివేదిక సమర్పించకపోతే.. అదే రోజు కమిటీ రద్దయిపోతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే సంబంధిత శాఖ వెబ్సైట్లో నివేదికను బహిరంగ పరచాలని తెలిపింది. కమిటీ నివేదికను పరిశీలించి సెప్టెంబరు నెలాఖరు నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో 111పై తదుపరి విచారణను అక్టోబరు 4కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: CORONA CASES IN SCHOOLS: పాఠశాలల్లో కరోనా కలకలం.. వైరస్ బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు