TS High Court On Aasara pension: రాష్ట్రంలో ఉద్యోగులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో వాయిదా వేసిన వేతనాలు, ఫించన్లకు ఆరు శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వేళ ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల ఫించన్లలో ప్రభుత్వం యాభై శాతం కోత విధించింది. ఉద్యోగుల జీతాలకు కోత విధించడాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా 6 శాతం ఇవ్వాలి: పరిస్థితులు కుదుట పడిన తర్వాత వాయిదా వేసిన జీతం, ఫించన్లను తిరిగి చెల్లించినట్లు ఉన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాయిదా వేసిన వేతనాలు, ఫించన్లకు వడ్డీ చెల్లించాలని పిటిషనర్లు వాదించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కోత విధించిందని కోర్టుకు తెలిపారు. ఏపీ ఉద్యోగులకు 6 శాతం వడ్డీ చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో కూడా 6 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సుమోటోగా తీసుకున్న కేసు: మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెదక్‌లోని ఖదీర్ ఖాన్ మృతి కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. పత్రికల్లో కథనాల ఆధారంగా సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఖదీర్‌ఖాన్ మృతిపై సిజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. మెదక్ పోలీసుల దెబ్బలకు ఖదీర్‌ఖాన్ మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైకోర్టు స్పందించనందున ఈ కేసు విచారణ ఉన్నత న్యాయస్థానంలోనే జరగనుంది.
ఇవీ చదవండి: