యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం (వైటీపీపీ) టెండర్లను అసమర్థ కంపెనీలకు అప్పగించొద్దని తెలంగాణ జెన్కో స్పష్టం చేసింది. ఈ కేంద్రం పనులను 2017లో జెన్ కోకు అప్పగించగా, పూర్తి కాంట్రాక్టును భెల్‌కు అప్పగించారు. ఈ పనులను విడగొట్టి మళ్లీ ఇతర కంపెనీలకు ఉప కాంట్రాక్టు ఇచ్చేందుకు భెల్ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ప్లాంటు బూడిద నిర్వహణ కుండీ (యాష్ పాండ్) టెండర్‌పై వివాదం తలెత్తింది.
4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్కేంద్రం నిర్మిస్తున్నారు. 29,965 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పనులను 48 నెలల్లో పూర్తి చేయాలని భెల్‌కు ఇచ్చిన కాంట్రాక్టులో నిబంధన పెట్టారు. పనులు నత్త నడకన సాగుతున్నాయని జెన్ కో అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇండ్యూర్ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ?
పనులను త్వరగా పూర్తి చేయడానికి ఉప కాంట్రాక్టులివ్వాలని భెల్ టెండర్లను పిలిచింది. ఇందులో యాష్ పాండ్ కాంట్రాక్ట్‌కు ఇండ్యూర్ ప్రైవేట్ కంపెనీ టెండర్ వేసిందని జెన్ కో గుర్తు చేసింది. సదరు కంపెనీ పనితీరు సంతృప్తికరంగా లేదనే సంగతి తమ దృష్టికి వచ్చిందని జెన్ కో తెలిపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల భెల్‌కు లేఖ రాసింది. జార్ఖండ్ రాష్ట్రంలోని పట్రాటు గ్రామం వద్ద ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీ సంయుక్తంగా 2,400ల మెగావాట్ల భారీ విద్యుత్కేంద్ర నిర్మాణం చేపట్టింది. ఈ ప్లాంట్ పనుల కాంట్రాక్టును ఇండ్యూర్ కంపెనీకి ఇవ్వొద్దని పట్రాటు ప్లాంట్ యాజమాన్యం ఎన్టీపీసీని ఆదేశించిన మాట వాస్తవేమని జెన్కోకు ఇచ్చిన వివరణలో భెల్ తెలిపింది. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు ఇవ్వడానికి ఎన్టీపీసీనే అంగీకరించిందని వివరణలో స్పష్టం చేసింది.
జెన్ కో అంగీకరిస్తుందా ??
ఇప్పుడు యాదాద్రి పనులను ఇండ్యూర్ కంపెనీకి ఇవ్వడానికి జెన్కో అంగీకరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. యాదాద్రి పనుల్లో జాప్యం ఎందుకు చేస్తున్నారని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇటీవల భెల్ సీఎండీకి లేఖ రాశారు. లేఖ కాపీని కేంద్ర విద్యుత్ మండలికి సైతం పంపించారు. ఫలితంగా స్పందించిన భెల్ సీఎండీ... నేరుగా హైదరాబాద్ వచ్చి ప్రభాకర్ రావును కలిసి వివరణ ఇచ్చారు. పనుల్లో జాప్యానికి చింతిస్తున్నామని ఇక వేగంగా పూర్తి చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలోనే ఉప కాంట్రాక్టులివ్వడానికి 3,800ల కోట్ల రూపాయలతో పిలిచిన టెండర్‌ను సైతం భెల్ విడగొట్టి ఒక్కో పనివారీగా మళ్లీ ఇతర కంపెనీలకు అప్పగిస్తోందని జెన్కో వర్గాలు తెలిపాయి. ఉప కాంట్రాక్టులు ఏ కంపెనీలకి ఇస్తున్నారో, వాటి సామర్థ్యం, యాదాద్రి పూర్తైన తర్వాత అవి సక్రమంగా నిర్వహణ చేస్తాయా లేదా అనే విషయంపై భెల్‌కు ముందస్తు సూచనలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇండ్యూర్ పై నివేదిక అడిగినట్లు జెన్కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చూడండి : ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్‌కే!