రాష్ట్ర ప్రయోజనాలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజీలేని పోరాటం చేస్తామని తెరాస ఎంపీలు స్పష్టం చేశారు. ఈ నెల 14నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు అనేక అంశాల్లో అన్యాయం చేస్తోందని సమావేశంలో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. రాజ్యంగబద్ధంగా రాష్ట్రానికి రావల్సిన నిధులు, అభివృద్ధి పనులను కేటాయించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ మండి పడ్డారు. కేంద్రం తీరుపై సహనం నశించిందని.. ఇక పార్లమెంటులో యుద్ధమే చేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.
విభజన హామీలు, జీఎస్టీ పరిహారం, నీటి వివాదాలు, విద్యుత్ సవరణ బిల్లు సహా ఇతర అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.... అన్ని అంశాలపైనా ఉభయసభల్లో బలమైన వాణి వినిపిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారం కోసం కలిసివచ్చే పార్టీలను కలుపుకొని గాంధీ విగ్రహం వద్ద... ధర్నా చేస్తామని కేకే ప్రకటించారు.
ఇదీ చూడండి : స్వగ్రామంలో శ్రావణి అంత్యక్రియలు... సాయికృష్ణా రెడ్డి హాజరు