TRSLP Meeting: తెరాస శాసనసభ పక్షం నేడు భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పెన్షన్లు, గిరిజనులకు పోడు భూముల వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెరాస వెల్లడించింది. అయితే మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసనసభ పక్షం సమావేశంలో ఏం చర్చించనున్నారనే రాజకీయాసక్తి నెలకొంది.
ప్రధానంగా కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశాలపై తెరాస ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా భాజపా దూకుడు తదితర అంశాలపై వివరించనున్నారు. మునుగోడు ఉపఎన్నికకు దారితీసిన పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలు, కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దసరా వరకు జాతీయ రాజకీయాలపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇటీవల మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల రైతు నేతలతో జరిగిన చర్చల సారాంశం.. నిర్ణయాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వివరించనున్నారు. బిహార్ పర్యటన, వివిధ రాష్ట్రాల నేతలతో చర్చలు, వామపక్షాలతో కలిసి పనిచేయడం వంటి అంశాలపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు . తెలంగాణ ప్రాంతం భారత్‌లో కలిసి 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో.. విలీన దిన వజ్రోత్సవాలు, రైతాంగ సాయుధ పోరాటాలను గుర్తు చేసుకునేలా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్వర్ణోత్సవాల నిర్వహణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడం.. జాతీయ రాజకీయాలకు సిద్ధం చేసే దిశగా శాసనసభ పక్షం సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు పేదలు కనిపించట్లేదా?: మంత్రి గంగుల
షాకింగ్ వీడియో.. ఐస్‌క్రీం కోసమని వెళ్లిన నాలుగేళ్ల పాప ఉన్నట్టుండి..